Monday, May 13, 2013

పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు

                పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు 

మనం రోజూ దిన పత్రికలలో చూస్తూ ఉంటాము , పిడుగు పడి కొంత మంది చనిపోయారు అని , చాలా బాధ గా ఉంటుంది. అంతవరకూ చక్కగా ఉన్న వాళ్ళు ఒక్క సారిగా తీవ్రంగా గాయపడడం గాని చనిపోవడం గాని జరుగుతుంది .  అసలు ఈ పిడుగు పడడం అంటే ఏమిటో నాకు తెలిసిన విషయాలు, మీతో పంచుకుంటున్నాను.   ఈ సబ్జెక్టు గురించి కెమిస్ట్రీ గురు లా క్లాసు తీసుకొనే సబ్జెక్టు నాకు లేదు కాని చాల సరళం గా వివరించే ప్రయత్నం చేస్తాను. 

పిడుగు :  దీనిని ఇంగ్లీష్ లో lightning లేదా lightning strike  లేదా lightning ఫ్లాష్ అని కూడా అంటారు.  పిడుగు అంటే  మేఘం లో ఉన్న  ఋణ విద్యుదావేశం భూమి మీదకు ప్రవహించడం. 

అంతేనా అనిపిస్తోంది కదా ? అవును అంతే.  కరెంటు షాక్ గుర్తు తెచ్చుకోండి , పాజిటివ్ కరెంటు , మన ద్వార   భూమి లోకి ప్రవహిస్తే  మనకు షాక్ తగులు తుంది.  
మనకు కనిపించే మేఘం లో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్ తో ఉంటే , క్రిందనున్నది నెగటివ్ ఛార్జ్ తో ఉంటుంది. 
మేఘం అడ్డం గా ఉంటుంది కదా మరి ఏది పాజిటివ్ , ఏది నెగటివ్ అనే సరదా ప్రశ్న పక్కన పెడితే , ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్ ఎనర్జీ , నెగటివ్ ఎనర్జీ తో  నిర్మితం అయి ఉంటుంది.  మేఘం లో నెగటివ్ ఎనర్జీ , పక్క మేఘం లో పాజిటివ్ ఎనర్జీ కి తగిలితే , ఆకాసంలో మనకు మెరుపు కనిపిస్తుంది. అదే మేఘం లో నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ తో కలిస్తే పిడుగు అవుతుంది.  అసలు పిడుగు పడడం అనే మాటే తప్పు గా తోస్తోంది , ఎందుకంటే 
భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ , మేఘంలో లో నెగటివ్ ని ఆకర్షిస్తోంది, కాబట్టి తప్పు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ దే అంటారా ?  పిడుగు పడేడప్పుడు మనకు కనిపించే  పెద్ద మెరుపు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై , మేఘాన్ని చేరుతుంది అంతే కాని ఆ మెరుపు మేఘం నుండి భూమికి చేరదు. 

 ప్రక్క చిత్రం చూడండి , మెరుపు భూమి నుండి పైకి వెళుతోంది . 

 


మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

పిడుగు ఈ ప్రదేశంలో పడుతుంది , ఇక్కడ పడదు అని ఖచ్చితంగా చెప్పలేము. కాని ఎత్తైన భవనాలు , పెద్ద చెట్లు మీద ఎక్కువగా పడుతుంది , ఎత్తైనవి త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. పెద్ద చెట్లు, బిల్డింగ్ లు లేకపోతే పిడుగు మనషుల మీద నేరుగా  పడుతుంది , మనిషి మంచి విద్యుత్ వాహకం కదా.  మిగతా పరిసరాలు కన్నా మన ఎత్తు తక్కువగా ఉన్నపుడు పిడుగు మనిషి మీద పడే అవకాశం తక్కువ . 


1.వర్షం వస్తోంది కదా అని పొరపాటున కూడా ఎత్తైన చెట్టు క్రింద నిలబడకూడదు. తాడి చెట్టు , మర్రి చెట్టు లాంటి వాటి క్రింద అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్లు త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. వాటికింద ఉన్న వాళ్లకు తప్పకుండా పిడుగు దెబ్బ తగులు తుంది. 
2.  చెట్టు క్రింద నిలబదకూడదు , అలాగే   నేల మీద కూడా పడుకోకూడదు. చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టు కొని , తల క్రిందకు వంచి ఎటువంటి చెట్లు లేని చోట చేతులు భూమికి తగల కుండా అరికాళ్ళ మీద కూర్చోవాలి. వర్షం పడిన ప్రతిసారి ఇలా చేయమని కాదు , కాని విపరీత మైన మేఘాలు , మెరుపులు తో  పిడుగులు పడుతున్నప్పుడు, అందుబాటులో ఏ బిల్డింగ్ లేనప్పుడు , ఇది తప్పదు. 
3. నేల మీద తక్కువ ఎత్తు ఉన్న చోట పై విధంగా చేయాలి,  పెద్ద వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు , పక్కనే షెల్టర్ లేకపోతే  ఒక కారు , బస్సు లాంటి పైన మూసివేసిన  వాహనాలు లో కూర్చొంటే  మంచిది.  కారు మీద , ఇలా పైన మూత ఉన్న వాహనాలు మీద పిడిగు పడే అవకాశాలు తక్కువ.  ఒక వేల పడినా , వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ ను అన్ని దిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది.  (కారు మీద వర్షం పడితే చినుకులు అన్ని చెల్లా చెదురు అయినట్లు) తద్వారా పిడుగు ఎఫెక్ట్ ను అంతగా లేకుండా చేస్తుంది . MICHEAL FARADAY ఎఫెక్ట్ చదవండి . 
4. ఉరుములతో వర్షం మొదలైన తర్వాత , కాలి నడకన , మోటార్ సైకిల్, సైకిల్ ద్వార  ప్రయాణం అంత మంచిది కాదు .  పిడుగుల వర్షం మొదలవగానే ఒక కిటికీలు లేని గదిలో వర్షం తగ్గే వరకు ఉండాలి. రూమ్ కిటికీలు ఉంటె తప్పకుండా మూసి ఉంచాలి. పిడుగు కిటికీల నుండి లోపలకు చక్కగా రాగలదు. కిటికీ ఉంటే , కనీసం కొంత సేఫ్ కదా. 
5.  నేల మీద చెట్లకు , ఇనుప పెన్శింగ్ నకు, పైపులకు, పొడవైన భవంతులకు, ట్రాన్స్ఫార్మర్ లకు  దూరంగా ఉండడం మంచిది. 
6 .  సిటీ లో కాదు కాని కొంచం పల్లెటూరు లలో రేకులతో చేసిన బాత్ రూములు ఇప్పటికీ ఉన్నాయి, రేకులు విద్యుత్ వాహకాలు కాబట్టి , మనం చక్కగా వర్షం పడుతోంది అని రెండు వేడి వేడి చెంబులతో స్నానం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాను కోవాలి.
7. ఈ సమయంలో సముద్రం, నది , చెరువులలో ఈత కొట్టటం వెంటనే ఆపుచేయాలి, వెంటనే ఒడ్డుకి , తలుపులు మూసి ఉన్న భవంతి లోకి చేరాలి. 
8. గొర్రెల కాపరులు , గొర్రెలను వర్షంలో ఏమాత్రం ముందుకు నడపక, తగు జాగ్రతలు తీసుకోవాలి. 
9. ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ వాడకండి ,  పిడుగు ఎఫెక్ట్ ఫోన్ లైన్ మీద పడితే మీరు పట్టుకొన్న ఫోన్ కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు . ఇంట్లో సెల్ ఫోన్ కానీ కార్డ్ లెస్ ఫోన్ కాని ఫర్వాలేదు . 



Tuesday, March 12, 2013

యండమూరి గారికి మనసు విరిగిన అభిమాని ఆవేదన


నవలా ప్రపంచంలో తిరుగులేని యండమూరి , నిజజీవితం లో ఇంత చీప్ గ ఆలోచించడం తట్టుకోలేక పోతున్నాను. ఆయనంటే ఒక రచయితగా ఎంతో ఇష్టపడ్డాను , కానీ ఆయన  మాటల్లో కలంలో ఉన్న గొప్పతనం ఏది కనిపించలేదు కాని ఒక ఊహకు అందని , మనసు తట్టుకోలేని మనిషిని చూడవలసి వచ్చింది .  దానికి గల కారణం జ్యోతి అనే అమ్మాయి ఆత్మహత్య మీద ఆయన అభిప్రాయమే . ఈ క్రింది ఇంటర్వ్యూ చూసి నేను ఇలా స్పందిస్తున్నాను . 33:55 సెకండ్స్ నుండి చూస్తే అలా అనిపించింది

యండమూరి మాట :  ఈ ఇంటర్వ్యూ జాగ్రతగా చూస్తే జ్యోతి అనే అమ్మాయికి ఈయన ఆరు నెలలుగా ఉత్తరాలు రాసేవారని చెప్పారు. అందులో నీ కళ్ళు నాకు చాల ఇష్టం , నువ్వంటే చాల ఇష్టం అని రాసినట్లు చెప్పరు.
విమర్శ: అప్పటికే పెళ్లై న వాడు , ఒక అమ్మాయికి అలా  నువ్వంటే ఇష్టం , నీ కళ్ళు ఇష్టం అని రాయండం ఏమిటి? నార్మల్ గా రచయితలు మీ అభిమానానికి ధన్యవాదాలు అని సరిపెడతారు -ఎవరైనా
యండమూరి మాట :  విజయవాడలో ఈయన lodge లో ఉంటె  జ్యోతి అనే అమ్మాయి ఉదయం 7 గంటలకు  lodge కి వచ్చింది అన్నారు
విమర్శ: అసలు విజయవాడ వెళుతున్నట్లు , lodge  లో ఉన్నట్లు జ్యోతికి ఎలా తెలుస్తుంది . ఈయనేమి రాజకీయ నాయకుడు కాదు  మీడియా ద్వారా తెలియడానికి.  ఈయనే జ్యోతిని  పిలిపిస్తే తప్ప ఆ అమ్మాయికి తెలియదు.  సరే ఒక పెళ్లి కాని అమ్మాయిని లాడ్జ్ కి పిలవడం ఏమిటి? ఇదేనా సంస్కారం ?
"అసలు ఈయన జ్యోతి ఫోటో చూసి మతి పోయి , ఛాన్స్ దొరుకుతుంది అని విజయవాడ వెళ్ళిన విషయం మనకు క్లియర్ గా తెలుస్తోంది . ఆయనే చివర్లో ఆమాట అన్నరు. అవకాసం దొరికితే RK  గారు మీరు వదులు కొంటార
అని కూడా అడిగారు . "
యండమూరి మాట : జ్యోతి ఫోటోలో లా లేదు అని నాకు విపరీతమైన కోపం వచ్చింది , బాగా తిట్టేసాను . 
విమర్శ:  అసలు రచయిత అందంగా ఉండాలని ఏ  పాఠకుడు/పాఠకురాలు  కొరుకోరు. అలాగే అభిమానులు అందం గురించి రచయితా ఆలోచించరు . అలాంటిది జ్యోతి తను ఫోటో చూసినట్లు లేదని  ఈయనకు కోపం రావడం ఏమిటి?
అసలు ఇదేమైన పెళ్లి చూపుల వ్యవహారమ ? ఇంకా పచ్చిగా చెప్పాలంటే సాని తనమా? Lodge  కి రమ్మనడం , నీ కళ్ళు ఫోటోలోలా  లేవు,  అందంగా  లేవు అని బాగా తిట్టడం ..నమ్మ శక్యం గా లేవు.
యండమూరి మాట : నేను  జ్యోతిని ముట్టు కొన్నాన? ఏదైనా తప్పు చేసాన?
విమర్శ: ఎంత దిగజారుడు తనం ? ఏ కాలంలో ఉన్నారు బాబు మీరు ? ముట్టు కొంటే తప్పు , ముట్టుకోకుండా మనసును ముక్కలు చేస్తే ఒప్పా ? అసలు పరాయి ఆడదాని అనమతి లేకుండా ముట్టుకొంటే అది బలాత్కారం , దానికి శిక్ష ఉంటుంది. అదే తనే ఇష్టపడి వచ్చినా ముట్టుకోకుంటే అది సంస్కారం అవుతుంది. మరి మీరు ఈ ఉదేశ్యం  లో ముట్టుకోనే వరకు ఆలోచించారు . అంటే మీరు  ముట్టుకొన్న ఆ అమ్మాయి ఏమి చేయలేదనే ధీమా తో అలా మాట్లాడార ?
యండమూరి మాట : నా ఫ్రెండ్ మరో తోటి రచయిత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. 
 విమర్శ:  దీనిని బట్టి మీరు మీ ఫ్రెండ్ విజయవాడ వెళ్ళిన పని ఏమిటో తెలుస్తోంది , మీరు ఆ అమ్మాయిని కేవలం ఒక పాఠకురాలిలా చూస్తే , మీరే తనని నలుగురు ఉండే చోటుకు రమ్మనే వారు, ఆవిడ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపెవారు. ఇలా రహస్యంగా లాడ్జ్ కి రమ్మనే వారు కాదు.
యండమూరి మాట : శవాన్ని మళ్ళి తవ్వి తీసారు , కన్య అని తేలింది.
విమర్శ: ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొంటే ఆ కుటుంబం ఎంత కుమిలి పోతుందో మీకు తెలియదా? అలాంటిది , చని పోయిన అమ్మాయిని మళ్ళి తవ్వి తీసి కన్యత్వ పరీక్ష చేసారు అంటే అంత కంటే ఆకుటుంబానికి అవమానం ఉంటుందా? చనిపోయినా ఆ పరీక్షలో నెగ్గిన ఆ అమ్మాయిని సీత దేవి అంత గొప్పది కాదా ? మీరు తన చావు పైన ఏ  మాత్రం జాలి లేకుండా , మీరు తన కన్యత్వం దోచుకోలేదు కనుక నా తప్పు లేదు అని సమర్ధించు కొంటున్నారా ? రావణుడు కూడా తన వాకిలిలో ఉన్న సీతను ఎన్నడు ముట్టుకోనే సాహసం చేయలేదు.
మరి మీరు , ఫోటో పంపించి , కళ్ళు బాగుండే సరికి , ఇల్లు పెళ్ళాం వదిలి విజయవాడ పరిగెత్తుకు వెళ్లి ,  లాడ్జ్ కి రమ్మని , అమ్మాయి ఫోటో లో లా  లేక పోయేసరికి తనని మానసికంగా హింసించి , ఆత్మ హత్యకు ప్రేరేపించడం రావణుని తప్పుకన్న పెద్ద తప్పు అనిపించడం లేదా?


చివరగా ఒక్క మాట మీ నవలా  భాషలో చెబుతాను -  ఆడవారి  విషయంలో అవకాశం కోసం ఎదురు చూసేవాడు సన్నాసి , అవకాశమున్న వదులుకొనెవాడు  ఋషి, అసలు ఈ ఆలోచనలే  రానివాడు మహర్షి .

Sunday, January 22, 2012

అవధానం సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!



సమస్య వివరణ: భగవద్గీతను నమ్మరాదని శ్రీకృష్ణుడు పార్థునితో అంటే అర్జునునితో అన్నాడట. అదేమిటి? గీత బోధ జేసిన శ్రీకృష్ణుడే గీతను నమ్మ రాదని అర్జునుడితో యెట్లా చెబుతాడండీ? అదే సమస్య. అవధాని గారెట్లా ఈ వాక్యాన్ని సమర్థించారో చూద్దాం.


అవధాని: . ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్..
చందస్సు: ఉత్పలమాల

పూరణ:ఉ.

 జాతికి దారి చూపి దృధసత్వమునిచ్చి మనస్సునందునన్
 భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత, దు
 ర్నీతులబద్ధ మిద్దియని నిందలతో పరిహాసమాడినన్
 గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!


వ్యాఖ్యానము: మన జాతి మొత్తానికి దారి చూపించి, దృఢమైన శక్తినిచ్చి మనమనస్సులలోని భయాన్ని పారద్రోలింది భగవడ్గీత. ఆ విధంగా మనకున్న యెన్నో వేదనలనీ, బాధలనీ పోగొట్టింది భగవద్గీత. అటువంటి భగవద్గీతనెవరైనా యివన్నీ అబద్ధాలు అని నిందజేసి పరిహాసమాడితే నమ్మ రాదని కృష్ణుడు పార్థుడితో అంటే అర్జునుడితో అన్నాడయ్యా మిత్రుడా అని ఒక అతను యింకొక అతనితో అంటున్నాడని అవధానిగారు పూరించారు.

Tuesday, January 17, 2012

ఆముక్తమాల్యద మొదటి పద్యం వివరణ

                                 ఆముక్త మాల్యద మొట్ట మొదటి పద్యం వివరణ చూడండి 





Monday, January 16, 2012

అవధానం సమస్య పూరణం : కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

అవధాని: ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్.
చందస్సు: ఉత్పలమాల

 సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

పూరణ:

ఉ. భీత మృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మ బాధచే

   నాతికి పెండ్లి కాదని వినాశన మౌనని నేస్తులెంచుచున్

   జాతకముల్ గుడించగ భిషక్కుని సాయము నంది మందొమా 

   కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

వ్యాఖ్యానము: అందమైన లేడి కన్నుల వంటి కన్నులున్న ఒక సుందరి యౌవనము ప్రవేశించి వివాహానికి దగ్గరౌతున్న  సమయంలో చర్మవ్యాధికి లోనై అందవికారముగా కనిపించటము వలన వివేచన అంటె యేమి చెయ్యలో తొచని స్థితికి పోయింది. ఆమె స్నేహితురాండ్రు యీమెకు పెండ్లి కాదని విచారిస్తూ ఆలోచించి ఒక జోతిష్కుడిని సంప్రదించి ఈమెకి వివాహమయ్యే సూచనలేమన్నా కనపడుతున్నాయా జాతకము ప్రకారము అని ప్రశ్నించగా అతడు ఆమెకు తప్పక వివాహము అవుతుందని చెప్పాడు. దాంతో వాళ్ళు విచారము మాని ఆమెని ఒక భిషక్కునికి అంటే వైద్యుడికి చూపించి అతనిచ్చిన మందో మాకో యిప్పించగా ఆమె అది తిని చర్మ వ్యాధిని పోగొట్టుకొని చక్కగా వివాహము చేసుకొంది అనేది అవధాని వరేణ్యుల కల్పన సమస్యను విడగొట్టడానికి. యిందులో మందొమాకో అనే పదం ఉపయొగించి సమస్యని తేల్చేశారు.  పరిశీలించండి.

Friday, January 13, 2012

దత్తపది - హిందీ పదాలు: దీదీ, తేరా, దేవర్, దివాన తో కరెంటు కోతల మీద పద్యం

మన తెలుగు అవధానులు ఎంత తెలివైన వారో అనిపిస్తుంది. నిన్న ఇంగ్లీష్ పదాలిచ్చిన చక్కగా వాటిని తెలుగు పదాలుగా మార్చి, ఛందస్సు బంధురంగా చక్కటి పద్యాన్ని చెప్పడం చూసాం. మరి ఈ రోజు ఒక పృచ్చకుడు హిందీ పదాలు ఇచ్చి పద్యం చెప్పమంటే మన అవధానులు ఎలా పూరించారో చూద్దాం.

హిందీ దత్తపది చూడండి. దత్తపది హిందీ పాటలోని మొదటి భాగం.
దత్త పదాలు:  దీదీ, తేరా, దేవర్, దివాన
విషయం : విషయం చెప్పే లొపలవేదికపైన పవర్ పోవటంతో కరెంటు కోతలమీద దత్తపది.  పూరించమన్నాడు  పృచ్చకుడు. యిది హం ఆప్ కే హై కౌన్ సినిమా పాటలో భాగం
అవధాని: శతావధాని, అవధాన పంచానన. గౌరీభట్ల.మెట్రామ శర్మ.
చందస్సు: శార్దూలం.
ఏదీ  దీనులకింక వెల్గుగతి యిట్లీ సాంద్ర చంద్ర ప్రభు
త్వోదార ప్రకటప్రదేశమున యెంతో కాంతి హీనమ్మ? తే
రా దివ్య ప్రభలీ ప్రభుల్, వరము లీరా దివ్యదేవర్షు లై ,
హ్లాదమ్మీర? కరంటు కోతలివి యేలా దివా నక్తముల్

వ్యాఖ్యానము: ( యిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పటి పూరణ ) ఈ కరంటు కోతల పాలౌతున్న దీన జనులకు వెలుగులు లభించే అవకాశము ఏమన్నా ఈ గొప్పనైన  ( సాంద్ర అనే పదానికి దట్టమైన అని అర్థం. సాంద్ర అనే పదానికి  ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం “గొప్పనైన” ) చంద్రబాబు ప్రభుత్వములో కనిపిస్తున్నదా? ఈ ప్రభువులు (అంటే మంత్ర్లివరేణ్యులు ) దివ్యమైన ప్రభలను అంటే కాంతులను తీసుకురారా? వీరు దివ్య దేవర్షుల రూపంలో ( “దేవర్ ” అనే పదాన్ని చూడండి యిందులో ) ఈ దీనజనులకు వరములు యివ్వరా? లేకపోతే ఏమిటి రాత్రింబవళ్ళు ( దివా=పగలు, నక్తము=రాత్రి ) ఈ కరంటు కోతలు? 
హ్లాదము: ఆనందము

Thursday, January 12, 2012

అవధానం దత్తపది - ఓనీడా, డయనోరా, ఆస్కార్, ఆప్టానికా తో శ్రీ కృష్ణ రాయబార ఘట్ట వర్ణన



దత్త పదాలు:  ఓనీడా,  డయనోరా, ఆస్కార్, ఆప్టానికా  
విషయం : శ్రీకృష్ణ రాయబార ఘట్ట వర్ణన
ఛందస్సు: శార్దూలం.
ఓ నీడా! నిను చూడ భీతి కలిగెన్ యుధ్ధోద్యమప్రక్రియన్
హానిన్ గూర్చెడి నీ కుమారుడయ నోరారంగ వ్రాక్కిత్తు నీ
కానందమ్మొనగూర్తు యుద్ధమున కాస్కారమ్ము లేకున్నచో
నేనా దీనిని ఆపటానికి నిదానింపంగ నో కౌరవా!
వ్యాఖ్యానము: కౌరవ సభకు రాయబారానికి వొచ్చిన శ్రీకృష్ణుడు పాండవుల సందేశం అందించాడు. ఐదుగురుకీ ఐదు వూళ్ళిచ్చినా సరిపోతుందని అన్నా  సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వము “యుధ్ధమే  యుధ్ధమే”’   అనే  కౌరవుల భయానకమైన అరుపులను విన్న శ్రీకృష్ణుడు తన నీడను చూచి  యిట్లా అన్నాడు "ఓ నీడా! నా నీడవైన నిన్ను  చూస్తేనే భయం కలిగే విధంగా వున్నదీ భీతావహ యుధ్ధాన్ని  వుద్యమంగా తీసుకున్న కౌరవ కల్పిత పరిస్థితి. " ధృతరాష్ట్రుడి వైపుకి తిరిగి " నీ కుమారుడు హానిని కూర్చే వాదు. నొరార నేను చెపుతున్నను. వీళ్ళు నీ కుమారులు. వాళ్ళు నీ తమ్ముడి కుమరులు కనుక యిద్దరికీ సద్ది చెప్పి యుధ్ధానికి “ఆస్కారం” లేకుండాచేయగల సమర్థుడివి నువ్వు కనుక ఆ విధంగా చెయ్యగలిగితే నీకు నేను ఆనందము సమకూరుస్తాను. అంతే కానీ నేనా ఈ యుధ్ధాన్ని ఆపగల వాడను?