Monday, August 8, 2011

వంద కేజీల పంచామృతం పార పోసాను

నేను చాల బాధ పడుతూ చేసిన పని ఇది, కాని తప్పలేదు. మన ఆచారాలు పాటించాలి కదా. దేవునికి పంచామృతంతో అభిషేకిస్తే భక్తులకి ఎనలేని తృప్తి. ఆ స్వామి అలా పంచామృత ధారలలో స్నానమాడుతుంటే ఆ ఆనందం వర్ణించలేనిది కాదు.  అంత వరకు బాగానే ఉంది కాని, ఆ అభిషేకం తర్వాత ఆ పంచామృతం పారవేస్తున్నప్పుడు మాత్రం నాకు ఎనలేని దుఖం కలిగింది. నా కళ్ళు భక్తితో కాదు బాధతో వర్షించాయి. పూజరిగారికి సహాయకుడిగా ఉన్నాను. ఆయన అడిగినవి తెచ్చి పెట్టే పనిలో తీరిక లేకుండా వున్నాను. స్వామి వారి అభిషేఖానికి అన్ని సిద్దం అయ్యాయి.  పెద్ద పెద్ద బకెట్లు నిండా స్వచ్చమైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పళ్ళ రసాలు సిద్దం కావించా బడ్డాయి.  చుట్టూ వందల మంది భక్తులు.  మొదట పసుపు నీళ్ళతో అభిషేకించారు. చాల సంతోషం, మంగళ స్నానం చేయించారు. తర్వాత పాలు,  అలా చెంబులతో పాలు పోస్తున్నారు, తర్వాత పెరుగు, ఇంతలో నన్ను తేనె, నెయ్యి మైక్రో వేవు లో 45  సెకండ్స్  వేడి చేసి తెమ్మన్నారు. తెచ్చాను. గడ్డ పెరుగు తో అభిషేకించిన తర్వాత, కరిగించిన నెయ్యి తో అభిషేకించారు. తర్వాత తేనె తో అభిషేకించారు, చివరగా ఫ్రూట్ జూసు తో అభిషేకించారు.  బాగానే ఉంది కాని , ఆ పంచామృతం, పెద్ద పెద్ద డబ్బాలలో నింపారు.  మాకు తర్వాత చెప్పిన పని ఏమిటంటే,   ఎవరు తొక్క కుండ, ఆ పంచామృతం పారబోయడం.

 ఒక kg కి :  పాలు=1000 కాలోరీలు , పెరుగు = 1028 కాలోరీలు , నెయ్యి=9000 కాలోరీలు , తేనె =9200 కాలోరీలు , నారింజ పళ్ళ రసం =488 కాలోరీలు అనుకొంటే, మొత్తం =20716 కాలోరీలు.  వీటిలో పాల శాతం ఎక్కువ కనుక  మొత్తం సుమారు వంద కేజీల పంచామృతం 1071600 కాలోరీలు.  మన మధ్య తరగతి మనిషి రోజుకు 1000 కాలోరీలు ఆహరం తింటే దాదాపు వెయ్యి మంది కన్నా ఎక్కవ  మనుషులకు, ఒక రోజుకు సరిపడే కాలోరీల శక్తిని, అభిషేకించి,  ఎవరు తొక్కని గడ్డిలో పారపోసాము. ఇదంతా ఆ దేవున్ని ప్రీతి చేయించడానికి చేసిన పని. నా మనసు ఎందుకు ఈ పనిని ఒప్పుకోలేక పోతోంది? అందరిలా నీను కూడా జరిగే తతంగాన్ని చూసి, ఒక్క దణ్ణం పెట్టుకొని వచ్చేయ కుండ, ఎందుకు బాధ పడుతున్నాను? నాకు తెలీదు, కాని నా మనసుకు మాత్రం అనిపిస్తోంది, నేను అలా గడ్డిలో పారేయకుండా ఉండాల్సింది కాదు అని, సరే పారేయక పోతే ఏమి చెయ్యడం? నాకు తెలీదు, ఒక వేళ నేను  చెప్పిన వినే వాళ్ళెవరు?  అన్న పరబ్రమ్మ స్వరూపం అంటారు కదా, అంటే అది ఒక్క బియ్యం తో వండిన అన్నానికే అనుకొంటా. పాలు పెరుగు , తేనె .. పరబ్రమ్మ స్వరూప పరిధిలోకి రావేమో! ఎవరికి తెలుసు? వస్తే అలా పార పోయామని చెబుతారా?  అయిన ఎంత గొప్ప అభిషేకం జరిగితే భక్తులకి అంత తృప్తి, అంత గొప్ప విరాళాలు. కేవలం రెండు అగరవత్తులు, ఒక్క కొబ్బరి కాయ తో పూజ సరిపెడితే , భక్తుల మనో భావాలు, సంతృప్తి పడొద్దు. ఎవరినా శాస్త్రం తెలిసిన పెద్దలు, " ఏమిటయ్య ఈ పూజలు ..? పంచామృతం ఏది? ఘనమైన నైవేద్యం ఏది" అని నిలదీస్తే? అమ్మో శాస్త్రం ప్రకారం జరగొద్దు?  ఎవరి కారణం ఏమైనా నాకు అనిపించేది ఒక్కటే, భక్తి పేరిట మనం చేసే ఖర్చులకు అంతం లేదు.