Sunday, January 22, 2012

అవధానం సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!



సమస్య వివరణ: భగవద్గీతను నమ్మరాదని శ్రీకృష్ణుడు పార్థునితో అంటే అర్జునునితో అన్నాడట. అదేమిటి? గీత బోధ జేసిన శ్రీకృష్ణుడే గీతను నమ్మ రాదని అర్జునుడితో యెట్లా చెబుతాడండీ? అదే సమస్య. అవధాని గారెట్లా ఈ వాక్యాన్ని సమర్థించారో చూద్దాం.


అవధాని: . ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్..
చందస్సు: ఉత్పలమాల

పూరణ:ఉ.

 జాతికి దారి చూపి దృధసత్వమునిచ్చి మనస్సునందునన్
 భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత, దు
 ర్నీతులబద్ధ మిద్దియని నిందలతో పరిహాసమాడినన్
 గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!


వ్యాఖ్యానము: మన జాతి మొత్తానికి దారి చూపించి, దృఢమైన శక్తినిచ్చి మనమనస్సులలోని భయాన్ని పారద్రోలింది భగవడ్గీత. ఆ విధంగా మనకున్న యెన్నో వేదనలనీ, బాధలనీ పోగొట్టింది భగవద్గీత. అటువంటి భగవద్గీతనెవరైనా యివన్నీ అబద్ధాలు అని నిందజేసి పరిహాసమాడితే నమ్మ రాదని కృష్ణుడు పార్థుడితో అంటే అర్జునుడితో అన్నాడయ్యా మిత్రుడా అని ఒక అతను యింకొక అతనితో అంటున్నాడని అవధానిగారు పూరించారు.

Tuesday, January 17, 2012

ఆముక్తమాల్యద మొదటి పద్యం వివరణ

                                 ఆముక్త మాల్యద మొట్ట మొదటి పద్యం వివరణ చూడండి 





Monday, January 16, 2012

అవధానం సమస్య పూరణం : కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

అవధాని: ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్.
చందస్సు: ఉత్పలమాల

 సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

పూరణ:

. భీత మృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మ బాధచే

   నాతికి పెండ్లి కాదని వినాశన మౌనని నేస్తులెంచుచున్

   జాతకముల్ గుడించగ భిషక్కుని సాయము నంది మందొమా 

   కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్

వ్యాఖ్యానము: అందమైన లేడి కన్నుల వంటి కన్నులున్న ఒక సుందరి యౌవనము ప్రవేశించి వివాహానికి దగ్గరౌతున్న  సమయంలో చర్మవ్యాధికి లోనై అందవికారముగా కనిపించటము వలన వివేచన అంటె యేమి చెయ్యలో తొచని స్థితికి పోయింది. ఆమె స్నేహితురాండ్రు యీమెకు పెండ్లి కాదని విచారిస్తూ ఆలోచించి ఒక జోతిష్కుడిని సంప్రదించి ఈమెకి వివాహమయ్యే సూచనలేమన్నా కనపడుతున్నాయా జాతకము ప్రకారము అని ప్రశ్నించగా అతడు ఆమెకు తప్పక వివాహము అవుతుందని చెప్పాడు. దాంతో వాళ్ళు విచారము మాని ఆమెని ఒక భిషక్కునికి అంటే వైద్యుడికి చూపించి అతనిచ్చిన మందో మాకో యిప్పించగా ఆమె అది తిని చర్మ వ్యాధిని పోగొట్టుకొని చక్కగా వివాహము చేసుకొంది అనేది అవధాని వరేణ్యుల కల్పన సమస్యను విడగొట్టడానికి. యిందులో మందొమాకో అనే పదం ఉపయొగించి సమస్యని తేల్చేశారు.  పరిశీలించండి.

Friday, January 13, 2012

దత్తపది - హిందీ పదాలు: దీదీ, తేరా, దేవర్, దివాన తో కరెంటు కోతల మీద పద్యం

మన తెలుగు అవధానులు ఎంత తెలివైన వారో అనిపిస్తుంది. నిన్న ఇంగ్లీష్ పదాలిచ్చిన చక్కగా వాటిని తెలుగు పదాలుగా మార్చి, ఛందస్సు బంధురంగా చక్కటి పద్యాన్ని చెప్పడం చూసాం. మరి ఈ రోజు ఒక పృచ్చకుడు హిందీ పదాలు ఇచ్చి పద్యం చెప్పమంటే మన అవధానులు ఎలా పూరించారో చూద్దాం.

హిందీ దత్తపది చూడండి. దత్తపది హిందీ పాటలోని మొదటి భాగం.
దత్త పదాలు:  దీదీ, తేరా, దేవర్, దివాన
విషయం : విషయం చెప్పే లొపవేదికపైన పవర్ పోవటంతో కరెంటు కోతలమీద దత్తపది.  పూరించమన్నాడు  పృచ్చకుడు. యిది హం ఆప్ కే హై కౌన్ సినిమా పాటలో భాగం
అవధాని: శతావధాని, అవధాన పంచానన. గౌరీభట్ల.మెట్రామ శర్మ.
చందస్సు: శార్దూలం.
దీ  దీనులకింక వెల్గుగతి యిట్లీ సాంద్ర చంద్ర ప్రభు
త్వోదార ప్రకటప్రదేశమున యెంతో కాంతి హీనమ్మ? తే
రా దివ్య ప్రభలీ ప్రభుల్, వరము లీరా దివ్యదేవర్షు లై ,
హ్లాదమ్మీర? కరంటు కోతలివి యేలా దివా క్తముల్

వ్యాఖ్యానము: ( యిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పటి పూరణ ) కరంటు కోతల పాలౌతున్న దీన జనులకు వెలుగులు లభించే అవకాశము ఏమన్నా గొప్పనైన  ( సాంద్ర అనే పదానికి దట్టమైన అని అర్థం. సాంద్ర అనే పదానికి  ఇక్కడ తీసుకోవాల్సిన అర్థంగొప్పనైన” ) చంద్రబాబు ప్రభుత్వములో కనిపిస్తున్నదా? ప్రభువులు (అంటే మంత్ర్లివరేణ్యులు ) దివ్యమైన ప్రభలను అంటే కాంతులను తీసుకురారా? వీరు దివ్య దేవర్షుల రూపలో ( “దేవర్ ” అనే పదాన్ని చూడండి యిందులో ) దీనజనులకు వరములు యివ్వరా? లేకపోతే ఏమిటి రాత్రింబవళ్ళు ( దివా=పగలు, నక్తము=రాత్రి ) ఈ కరంటు కోతలు? 
హ్లాదము: ఆనందము

Thursday, January 12, 2012

అవధానం దత్తపది - ఓనీడా, డయనోరా, ఆస్కార్, ఆప్టానికా తో శ్రీ కృష్ణ రాయబార ఘట్ట వర్ణన



దత్త పదాలు:  ఓనీడా,  డయనోరా, ఆస్కార్, ఆప్టానికా  
విషయం : శ్రీకృష్ణ రాయబార ఘట్ట వర్ణన
ఛందస్సు: శార్దూలం.
నీడా! నిను చూడ భీతి కలిగెన్ యుధ్ధోద్యమప్రక్రియన్
హానిన్ గూర్చెడి నీ కుమారుడయ నోరారంగ వ్రాక్కిత్తు నీ
కానందమ్మొనగూర్తు యుద్ధమున కాస్కారమ్ము లేకున్నచో
నేనా దీనిని ఆపటానికి నిదానింపంగ నో కౌరవా!
వ్యాఖ్యానము: కౌరవ సభకు రాయబారానికి వొచ్చిన శ్రీకృష్ణుడు పాండవుల సందేశం అందించాడు. ఐదుగురుకీ ఐదు వూళ్ళిచ్చినా సరిపోతుందని అన్నా  సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వము “యుధ్ధమే  యుధ్ధమే”’   అనే  కౌరవుల భయానకమైన అరుపులను విన్న శ్రీకృష్ణుడు తన నీడను చూచి  యిట్లా అన్నాడు " నీడా! నా నీడవైన నిన్ను  చూస్తేనే భయం కలిగే విధంగా వున్నదీ భీతావహ యుధ్ధాన్ని  వుద్యమంగా తీసుకున్న కౌరవ కల్పిత పరిస్థితి. " ధృతరాష్ట్రుడి వైపుకి తిరిగి " నీ కుమారుడు హానిని కూర్చే వాదు. నొరార నేను చెపుతున్నను. వీళ్ళు నీ కుమారులు. వాళ్ళు నీ తమ్ముడి కుమరులు కనుక యిద్దరికీ సద్ది చెప్పి యుధ్ధానికి ఆస్కారం” లేకుండాచేయగల సమర్థుడివి నువ్వు కనుక విధంగా చెయ్యగలిగితే నీకు నేను ఆనందము సమకూరుస్తాను. అంతే కానీ నేనా యుధ్ధాన్ని ఆపగల వాడను?

Tuesday, January 10, 2012

అవధానం - దత్తపది సరదాలు 2

 మీ అందరకు క్రిందటి దత్త పది నచ్చి నందుకు చాల సంతోషం. మీ కోసం ఇంకో తమాషా అయిన దత్త పది, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ఎంతో చమత్కారంతో పూరించిన విధానం చూడండి
 ------------------------------------------------
దత్త పదాలు: కల్లు,  రమ్ము,  విష్కీ, సారా 
భాగవతంలో  శ్రీ కృష్ణుని బాల్య ఘట్ట వర్ణన.
అవధాని: ద్విసహస్రావధాని భ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ.
చందస్సు: మత్తేభము
అగుగా కల్లుడు వాడు ఆరయగ నయ్యా యే మహా కాలుడో
నగవుల్ చిందగ రమ్ము రమ్మనుచు చంకన్ యెత్తుకో జాల తాన్
తగ నెవ్వాడు శిరస్సు దూర్చును పతజ్వాలా విష్కీలలన్
రగడల్ బాలురతోడ నేల? మనసారా యిట్లు చింతించెదన్

వ్యాఖ్యానము: బలరామ కృష్ణులను గురించి కంసుడు ఇట్లా అనుకుంటున్నాడు
కృష్ణుడు, అయితే నాకు అల్లుడౌగాక. అశరీర వాణి వాక్కు ప్రకారము వీడు నా పాలిటి యముడు. ప్రతి మేనమామా మేనల్లుడిని ముద్దుగా రమ్మని పిల్చి చంకనయెత్తుకొనే విధంగా వీణ్ణి నేను యెత్తుకోలేను. వీడితో పెట్టుకోవడమంటే హవిస్సు అగ్నిగుండములో వేసినతరువాత పైపైకెగసే జ్వాలా కీలల్లో తగుదునమ్మా అని తల తీసుకెళ్ళి  పెట్టతమే అవితుంది. యెందుకొచ్చిన రగడలు నాకీ బాలురతో. మనసారా విధంగా అనుకొంటున్నాను. 

Monday, January 9, 2012

అవధానం - దత్తపది సరదాలు



 ఈ మధ్యన నేను అమెరికాలో  శ్రీ మేడసాని మోహను గారి అవధానంలో అప్రస్తుత ప్రసంగo చేశాను. అక్కడ నాకు శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు  పరిచయం అయ్యారు, ఆయనకు అవధానంలో దత్త పది అంశాలు సేకరించడం హాబి, స్వయంగా మంచి కవి కూడా, ఆయన నాకు పంపించిన పద్యాలు మీ అందరికి కోసం ఇక్కర యధాతధంగా మీ ముందుంచుతున్నాను.
----------------------------------------------------------
వ్యాఖ్యాన పూర్వక దత్తపదాలు: ఒక పెళ్ళి కావలసిన యువకుడి కోసం అతని తల్లిదండ్రులు ఒక రోజు పెళ్ళి చూపులు యేర్పాటు చేసుకొన్నారు ఆడపిల్ల తల్లిదండ్రులతో సంప్రదించిన తరువాత. అంతకు ముందటి రోజు రాత్రి యువకుడు తియ్యటి ఆలోచనలతో నిద్రపోయాడు. అతనికి పెళ్ళి చూపుల కల వొచ్చింది. పెళ్ళి కూతురు కలలో భయంకరంగా కనిపించింది. ఆమెయొక్క వికృతాకృతరూపం "నడ్డి ముక్కుతో, మెల్లకళ్ళతోగూని వీపుతో, గారపండ్లతో వుంది. తెల్ల వారినాక పెద్దలు పెళ్ళిచూపులకి వెడదామంటే తన కల సంగతి చెప్పి చచ్చినా పెళ్ళిచూపులకు రానూ అన్నాడు. అప్పుడు  వాళ్ళు అలా అనకూడదు నాయనా, వొస్తామని చెప్పి వెళ్ళకపోవడం పెద్దమనుషుల లక్షణం కాదు, మనం వెడదాము. చూసినాక నచ్చకపోతే జాతకాలు కుదరలేదనో, మా పిల్లవాడు మీ అమ్మయికి తగడనో యేదో వొకటి సద్దిచెప్పొచ్చు" అని అన్నారు. పెద్దల మాటను తీసెయ్యలేక పెళ్ళిచూపులకు వెళ్ళాడా యువకుడు. అక్కడ అమ్మాయి అతిలోక సుందరిలాగా వుంది. అసలు ప్రపంచములో అంత అందము వుంటుందా? అనే విధంగా వున్నది. యిట్లా చెప్పి పృచ్చకుడు అవధానిని 1. నడ్డి ముక్కు 2. మెల్ల కండ్లు 3. గూని వీపు 4. గార పండ్లు అనే రాత్రి కలలోకి వొచ్చిన అమ్మయి అవలక్షణాలను దత్తపదులుగా వుపయొగించి ప్రతయక్షముగా పెళ్ళి చూపుల్లో పిల్ల వాడి యెదుత వున్న అతిలోక సుందరి అందాన్ని వర్ణించ మన్నాడు.

అవధాని: నరాల రామా రెడ్డి .
పూరణ:

చం. సొగసున సాటి రావనుచు సొంపుల సంపగి "నడ్డి ముక్కు" పొ
     ల్పుగ విలసిల్లె, బిట్టువడి మోహపడన్ జగ”మెల్ల కన్నులు”న్,
       నిగనిగ లాడె వీపుపై నీలి కురుల్ సొబ”గూని వీపు”పై,
       నగవులు గార పండ్లు” వదనమ్మున  వెల్గెను మల్లె మొగ్గలై.

వ్యాఖ్యానము: సహజంగా అందమైన అమ్మాయి ముక్కును సపెంగ ప్వ్వుతో పోలుస్తారు. అయితే ఇక్కడ అమ్మాయి ముక్కు యెంత అందంగా వుందంటే ముక్కే సంపెంగ పువ్వుని అడ్డుకొని నువ్వు నాకు సొగసున అంటే అందంలో సాటి రావు అని అందిట. ఆమె కళ్ళు యెంత అందంగా ఉన్నాయంటే  జగమెల్ల అంటె ప్రపంచం అంతా అంటె ప్రపంచములోని జనులందరూ కూడా నిశ్చేష్టులై ( బిట్టువడి ) మోహ పడే విధంగా వున్నాయి ( జగమెల్ల కన్నులున్ ). ఆమె జుట్టు నీలాకాశంలా నిగనిగా మెరుస్తూ సొబగు+పూని=సొబగూని అంటే అందాన్ని పొంది వీపుమీద పడి వుందట. ఆమె పండ్లు యెట్టా వున్నాయంటె  నవ్వులు కారి పోయేటట్ట్లు ముఖాన (వదనమ్మున) మల్లె మొగ్గలలాగ వెలిగిపోతున్నవట.