తెలుసుకోన్నంత సులువు కాదు, దానిని ఆచరించడం. ఒక వేళ అలా చేసిఉంటే, నేను ఎంతో సాధించే వాడినేమో? . అసలు నేనేనా? లేక అందరు అలాగే ఉంటారా? చిన్నప్పుడు పెద్ద వాళ్ళు ఎవరు కనబడిన అంటుండేవాళ్లు, "బాగా చదువుకో బాబు" ! అని, చాల చిన్న మాట అది "బాగా చదువుకో" నేను సరే అని, "బూం .. బూం అని నా ఊహాజనిత మోటారు సైకిల్ ను నడుపుకొంటూ పారి పోయేవాడిని. అసలు బాగా చదువు కోవడం ఏమిటి అని ఒక్క సారి ఆలోచించి ఉంటే, అప్పుడే అర్ధం అయ్యేది, వినడానికి, తెలుసుకోడానికి, ఆచరణలో పెట్టడానికి ఉన్న తేడ.
సరే కొంత వయసు వచ్చింది, అప్పుడైనా అనుకొన్నది చెయ్యొచ్చు కదా? అవును 'అనుకొన్నది' అన్న మాట వాడాను ఏమిటి? ఎవరినా చెప్పింది అనొచ్చు కదా? అవునులే నాకు కొంత వయసు వచ్చిన తర్వాత, ఎవరిమాటైన నేను ఎందుకు వింటాను? నాకేం కావాలో నాకు తెలుసు! సరే మరి 'అనుకొన్నది' ఎందుకు చెయ్యలేదు? ఉదయాన్నే నిద్రలేవాలని, ధ్యానం చెయ్యాలని, తనువూ మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని జీవితాన్ని, ఉత్శాహంగా మలచుకోవాలని ఇవ్వని నాకు తెలియనివి కావు, మరి ఇందులో కొన్ని కూడా చెయ్యలేను? ఎందుకు? ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదువే లోకంగా ఉండి ఉంటే, డాక్టర్ అయి, బ్రతికున్నన్నాళ్ళు ఎవరో ఒకరిచే గౌరవింపబడేవాడినని తెలుసు, కాని ఆ రోజుల్లో మంచులో తడిసిన నందివర్ధనం లాంటి అమ్మాయిల మీద కళ్ళు నిలిపితే , వాళ్ళలో కొంత మంది నాకు కళ్ళజోడు మిగిల్చి, EYE డాక్టర్స్ అయ్యారు. సరే నాకున్నఈ శరీరానికి (ఫిజిక్ అనేవాళ్ళు కొంతమంది), S.I అవుతావని అంటే, అదీ ప్రయత్నించాను. అసలది చాల సింపుల్ మేటర్, గట్టిగ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తాలి, ఇనుప గుండు బలంగా విసరాలి, ఓ చిన్నరాత పరిక్ష పాస్ అవ్వాలి. మరి వాటి కైనా ప్రేపేరు అవ్వాలి కదా ? ఉదయాన్నే నిద్ర లేవలేను, పరిగెత్త మంటే చాల బద్ధకం, ఎక్షమ్ కి చదవడం అంటే ఎంతో కష్టం. ఆరోజుల్లో కొంచెం కష్ట పడి ఉంటే, ఈ పాటికి కమీషనరు అయ్యి ఉండేవాడిని, లేదా కమీషనరకు ఒక కూతురుంటే, చంటి గాడిలా లైన్లోపెట్టేసే వాడిననే చిలిపి ఊహ!. అలా నాకు తెలిసిన విషయాలనే సాధించలేక పోయాను.