తెలుసుకోన్నంత సులువు కాదు, దానిని ఆచరించడం. ఒక వేళ అలా చేసిఉంటే, నేను ఎంతో సాధించే వాడినేమో? . అసలు నేనేనా? లేక అందరు అలాగే ఉంటారా? చిన్నప్పుడు పెద్ద వాళ్ళు ఎవరు కనబడిన అంటుండేవాళ్లు, "బాగా చదువుకో బాబు" ! అని, చాల చిన్న మాట అది "బాగా చదువుకో" నేను సరే అని, "బూం .. బూం అని నా ఊహాజనిత మోటారు సైకిల్ ను నడుపుకొంటూ పారి పోయేవాడిని. అసలు బాగా చదువు కోవడం ఏమిటి అని ఒక్క సారి ఆలోచించి ఉంటే, అప్పుడే అర్ధం అయ్యేది, వినడానికి, తెలుసుకోడానికి, ఆచరణలో పెట్టడానికి ఉన్న తేడ.
సరే కొంత వయసు వచ్చింది, అప్పుడైనా అనుకొన్నది చెయ్యొచ్చు కదా? అవును 'అనుకొన్నది' అన్న మాట వాడాను ఏమిటి? ఎవరినా చెప్పింది అనొచ్చు కదా? అవునులే నాకు కొంత వయసు వచ్చిన తర్వాత, ఎవరిమాటైన నేను ఎందుకు వింటాను? నాకేం కావాలో నాకు తెలుసు! సరే మరి 'అనుకొన్నది' ఎందుకు చెయ్యలేదు? ఉదయాన్నే నిద్రలేవాలని, ధ్యానం చెయ్యాలని, తనువూ మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని జీవితాన్ని, ఉత్శాహంగా మలచుకోవాలని ఇవ్వని నాకు తెలియనివి కావు, మరి ఇందులో కొన్ని కూడా చెయ్యలేను? ఎందుకు? ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదువే లోకంగా ఉండి ఉంటే, డాక్టర్ అయి, బ్రతికున్నన్నాళ్ళు ఎవరో ఒకరిచే గౌరవింపబడేవాడినని తెలుసు, కాని ఆ రోజుల్లో మంచులో తడిసిన నందివర్ధనం లాంటి అమ్మాయిల మీద కళ్ళు నిలిపితే , వాళ్ళలో కొంత మంది నాకు కళ్ళజోడు మిగిల్చి, EYE డాక్టర్స్ అయ్యారు. సరే నాకున్నఈ శరీరానికి (ఫిజిక్ అనేవాళ్ళు కొంతమంది), S.I అవుతావని అంటే, అదీ ప్రయత్నించాను. అసలది చాల సింపుల్ మేటర్, గట్టిగ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తాలి, ఇనుప గుండు బలంగా విసరాలి, ఓ చిన్నరాత పరిక్ష పాస్ అవ్వాలి. మరి వాటి కైనా ప్రేపేరు అవ్వాలి కదా ? ఉదయాన్నే నిద్ర లేవలేను, పరిగెత్త మంటే చాల బద్ధకం, ఎక్షమ్ కి చదవడం అంటే ఎంతో కష్టం. ఆరోజుల్లో కొంచెం కష్ట పడి ఉంటే, ఈ పాటికి కమీషనరు అయ్యి ఉండేవాడిని, లేదా కమీషనరకు ఒక కూతురుంటే, చంటి గాడిలా లైన్లోపెట్టేసే వాడిననే చిలిపి ఊహ!. అలా నాకు తెలిసిన విషయాలనే సాధించలేక పోయాను.
శ్రీ చంద్రశేఖర్ గారూ!
ReplyDeleteమీరీ వ్యాసం సరదాగా వ్రాశారా..?
లేక..?
మీగుఱించే అయితే ఇది వినండి. కాదు, చదవండి.
కవికులగురువు, కాళీవరప్రసాదుడు అయిన కాళిదాసు ,
సంస్కృతంలో కుమారసంభవమనే కావ్యాన్ని వ్రాశాడు.
అందులో పర్వతరాజపుత్రిక పార్వతి పుట్టుకను వర్ణించాక,
ఆమె విద్యాభ్యాసాన్ని వర్ణిస్తూ, ఇలా అంటాడు.
" తాం హంసమాలా శ్శరదీవగంగాం,
మహౌషధీం నక్తమివాత్మభాసః ,
స్థిరోపదేశా ముపదేశకాలే,
ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యా: ."
అంటే,
" స్థిరమైన (పూర్వజన్మ) శిక్ష కలదైన పార్వతిక
విద్య నేర్చు కాలం రాగానే,
ఆ పూర్వజన్మవిద్యలన్నీ
శరత్కాలం రాగానే గంగానదికి హంసలబారులూ,
చీకటి పడగానే మహౌషధికి వెలుగులూ వచ్చినట్లు
స్వయంగానే వచ్చాయి."
తండ్రి హిమవంతుడు, పార్వతికి విద్యాభ్యాససమయం రాగానే
గురువువద్దకు పంపించాడు.
గురువు, ప్రతి (విద్యా) విషయాన్ని ఒక్కసారే బోధించేవాడు.
ఆమెకు అవగతమయ్యేది.
అంటే, గురువు ఆమెకు ఆ విషయం తిరిగి జ్ఞాపకం చేశాడు. అంతే.
గురువుపాత్ర అంతవరకే.
ఇప్పుడు, ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నికల్ నిపుణులు, ఇత్యాదులకూ అంతే.
గొప్పవాళ్లెవరికైనా అంతే. ఒక్కసారి వినగానే ఒంటపడుతుంది కాబట్టే,
వాళ్లు గొప్పవాళ్లవుతారు.
ఒంట పట్టడమంటే ఆచరించడం.
మీకూ అనుభవంలోకి వచ్చే ఉంటుంది.
కొన్ని టాపిక్స్ (మీరు) అధ్యయనం చెయ్యకపోయినా
ఆ సందర్భం వచ్చినప్పుడు, బాగా తెలిసిన విషయంలా అనిపించి,
బాగా చెప్పడమో , వ్రాయడమో జరుగుతూంటుంది.
కాబట్టి, ఇంజనీర్లే గొప్ప డాక్టర్లే గొప్ప అని ఏమీ లేదు.
ఎవరి ఘనత వారిది.
పైగా ప్రతీ వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది.
దాన్ని గుర్తించగలగడమే విద్య.
స్వీయలోపంబులెఱుగుటె పెద్దవిద్య అన్నారు కదా!
అవి ఎఱిగి దిద్దుకోవడం పరమవిద్య.
మీరు ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నారో నాకు తెలియదు కానీ,
ఆ పనిని చిత్తశుద్ధితో చేస్తే చాలు. తప్పక గొప్పవారవుతారు.
ఇంజనీరో డాక్టరో అవ్వలేదని వగవనక్కరలేదు.
మీరే కనుక రైతైతే నాకు ఆరాధనీయులవుతారు.
జవానైతే పూజ్యనీయులవుతారు.
ఆఖరుకు చిన్నపాటి వృత్తివిద్యలో ఉన్నా మీరు నాకు గౌరవనీయులే.
నేనొక గొప్పకళాకారుణ్ణి మీలో చూస్తాను.
ఓ చందమామ కథలో ఒకవ్యక్తి , ఏ విద్య నేర్చుకొంటే గొప్పవాళ్లమవుతామో
అన్న విషయంలో స్పష్టత లేక అన్ని విద్యలూ సగం సగం నేర్చుకొని,
ఇక్కడ ఉంటే లాభం లేదని, రాజుగారి ప్రాపకంలో రాణించవచ్చని,
మారుమూల ఉన్న తన పల్లెటూరు వదలి, రాజధాని చేరతాడు.
కొన్నాళ్లున్నా ఆశ ఫలించదు.
ఒకసారి తండ్రి వస్తాడు. వ్యవసాయాభివృద్ధికి తాను కనుక్కొన్న కొన్ని
విశేషాలను రాజు గుర్తించి, సన్మానానికి పిలిచాడని చెప్తాడు.
అది విన్నాక కొడుక్కి జ్ఞానోదయం అవుతుంది.
ఎక్కడున్నా ప్రయత్నాన్ని బట్టి పేరు సంపాదించవచ్చని.
అయితే మీరే చెప్పారు బద్ధకం అని.
అదే పెద్ద అవరోధం అని తెలుసుకొన్నారుకదా!
ఆ.వె. చదువు మట్టుపడును; సంస్కృతి చెడిపోవు;
సంపదలు తొలంగు; సౌఖ్య ముడుగు;
గౌరవంబు వోవు; గావున సోమరి
తనము కన్న హీనగుణము కలదె ?
అయితే మీరు బద్ధకం అని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతున్నానన్నారు.
ప్రయత్నించాలి మఱి.
పురుషప్రయత్నం ఉండాలి కదా!.
పార్వతి, పూర్వజన్మలో బాగా చదువుకొన్నప్పటికీ,
పురుషప్రయత్నంగా హిమవంతుడు, అమెను గురువువద్దకు పంపించాడు కదా!
సంకల్పం అన్నింటికంటే గొప్పది.
అది సత్సంకల్పం అయ్యి, దాన్ని ఆచరణలో పెడితే ఇక జన్మే ధన్యం.
నాకు తోచింది చెప్పాను. ఎక్కువగా వ్రాసి (వాగి) నట్లున్నాను.
దానికీ, తప్పులున్నచో వాటికీ మన్నించండి.
నాగస్వరం.
http://www.nagaswaram.blogspot.com
http://sarath-kaalam.blogspot.com/2011/07/blog-post_28.html
ReplyDelete