Wednesday, January 26, 2011

స్వాతంత్రం రాకుండా ఉండుంటే ఎలా ఉండేవాళ్ళం

మనకు స్వాతంత్రం వచ్చి అరవై మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.  ప్రస్తుతానికి సాధించింది ఎంతో మనందరకూ తెలుసు. "బ్రిటిష్ వాళ్ళ కభంద హస్తాలలో చిక్కుకొని, కార్చడానికి కన్నీరు ఇంకి పోయి, తన బిడ్డలా అవస్థలు చూడలేక, వాళ్ళకు విముక్తిని ప్రసాదించలేక,  ఆ విషపు కోరల మధ్య నలిగిపోయిన భారత మాత ద్రాస్య సృంఖలాలు తెంచిన స్వాతంత్రం"..  బాబోయి ... చాలు  ..బాబోయి.. చాలు .. ఈ తాండ్ర పాపారాయుడు టైపు డైలాగులకు ఇది సమయం కాదు కానీ,  అసలు స్వాతంత్రం రాలేదు అనుకొంటే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఒక సారి తమాషాగా చూద్దాం.
  • బ్రిటిష్ వాళ్ళు పెట్టిన  మనదేశం పేరు మారదు కానీ ఇండియా, యుకె లో భాగం అయ్యి ఉండేది. అంటే మనం లండన్ వెళ్లి ఆక్ఫోర్డ్,  Cambridge university లో చదవాలంటే  VISA అక్కర లేదు. 
  •  మనవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్, యుకె వెళ్లి పనిచేసుకోవచ్చు. టికెట్ కొని వెళ్ళడమే అంతే.
  • ఒక్క యుకె మాత్రం కాదు, ఐరోపా ఖండం మొత్తం తిరిగి రావచ్చు. ఎక్కడైనా పని చేసుకోవచ్చు.
  • అమెరికా వెళ్ళాలంటే 90 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీ. ఈజీ గ్రీన్ కార్డు ప్రాసెస్సింగ్.
  • మన కరెన్సీ పౌండ్ అయివుండేది. ఒక పౌండ్ అంటే దాదాపు 75 రూపాయలు, అమెరికన్  డాలర్ కంటే చాల ఎక్కువ అంటే అమెరికన్స్ కన్నా ధనవంతులం. 
  • రిజర్వేషన్ లు ఉండేవి కాదు, టాలెంట్ ఉన్నోడిదే ఉద్యోగం. 
  • ఆంధ్ర, తెలంగాణా అంటూ  ఉన్న టైం అంత తగలేసే ఉద్యమాలు ఉండేవికాదు. 
  • చీటికి మాటికి నిరాహార దీక్షలంటూ, ఓట్లకోసం రైతు జపం చేసి,  రోడ్డుల మీద, రైలు పట్టాల మీద పడుకొని, అదే ఒక ఉద్యమం అని మురిసిపోయేపనికిమాలిన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కాదు. 
  •  విశ్వ విద్యాలయాల్లో చదువుకొంటున్న విద్యార్ధులే ప్రభుత్వ ఆస్తులు  ధ్వంసం చేస్తే,  ఆ ఆస్తులు రక్షించాల్సిన ప్రజా నాయకులే వాళ్ల మీద కేసులు ఎత్తివేయాలని సిగ్గులేని డిమాండులు చేసి ఉండేవాళ్ళు కాదు.
  • తెల్ల రేషన్ కార్డులు, పచ్చ రేషన్ కార్డులు, రెండు రూపాయల బియ్యం, రచ్చ బండ, గుదిబండ, లాంటి ఒట్లాకర్షణ గిమ్మిక్కులు ఉండేవి కావు. 
  • మన బస్సులు మనమే తగల బెట్టుకొని,  అదో గొప్ప ఘనకార్యం గా మురిసిపోయే మూర్ఖ ప్రజలను, నాయకులను చూసి గర్వపడే దౌర్భాగ్యపు స్థితిలో ఉండేవాళ్ళం కాదు. 
  • పాకిస్తాన్ నుండి వచ్చి, వందల మందిని పట్ట పగలు చంపిన వాడికి, సాక్షాలు సరిపోలేదంటూ ఇంకా రాచ మర్యాదలు చేస్తూ,  జైల్లో చికెన్ బిరియానిలు తినిపించే వాళ్ళం కాదు. 
  • మనకు తల్లి లాంటి  పార్లమెంటు మీద దాడి చేసి,  నాలుగురు  సైనికులను చంపినవాడిని,  మత ప్రాతిపదికన, ఓట్ల కారణంగా ఉరి తియ్యలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు.
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, మరెన్నో.  స్వతత్రం వచ్చి మంచి జరిగిందా?  లేక పెనం మీద నుండి పొయ్యిలో పడిన సామెత లాగా,  క్రూరత్వం, మరెంతో తెలివైన పరిపాలన కలిగిన బ్రిటిష్ వాళ్ళనుండి,  మూర్ఖపు,  కుల-మత ప్రాతిపదికన పరిపాలించే మన భారతీయ రాజకీయ నాయకుల చేతుల్లో పడ్డామా  అనేది ఎప్పటికి అర్ధం కానీ ప్రశ్న.  అదిసరే కానీ ..UK సిటిజెన్ షిప్...,  europe టూర్ అంటే నాలాగే కొంచెం ఆశ పడ్డార?.. ఉష్.... తప్పండి బాబు..  జై భారత్ , జై జై భారత్.


Thursday, January 13, 2011

నా అమెరికా కారు కధ

నాకు చిన్నప్పటి  నుండి కారు కానీ,  జీప్ కానీ నడపాలని ఎంతో కోరిక. చిన్నప్పుడు మా పక్కింటివాళ్ళ చుట్టాలు  జీప్ లో ఒరిస్సా నుండి వచ్చి మా ఇంటి ముందర పార్క్ చేసుకోనేవాళ్ళు. మా నాన్నని ,  "నన్ను తెల్లవారి నాలుగు గంటలకే లేప" మని,  వెంటనే  జీప్ లో దూరి పోయేవాడిని.  పదినిముషాలు అని చెప్పి, ఒక అరగంట ఆడుకొని నిజంగానే  నడిపినట్లు ఫీల్ అయ్యేవాడిని.  పాపం తెల్లవారి చూస్తె, గేరులు మరి పోయి, లైట్ స్విచ్లు ఆన్ అయి, ఒక రకం గా ఉండేది జీప్.  చేసింది నేనే నని తెలిసి,  " ఇంకోసారి ఇలా  పాడుచేస్తే జీప్ ఇక్కడే వదిలేస్తాం" అంటే, నిజమనుకొని,  నాన్న .."జీప్ ఫుల్ గా పాడు చేస్తా "అని ఏడ్చినట్లు గుర్తు!  ఆ ఏడుపుకు మిగతావల్లంతలా ఎందుకు నవ్వారో నాకు అప్ప్దుడు తెలీలేదు.

 విశాఖపట్నంలో బైక్ మీద ఎన్నో వేళ మైళ్ళు తిరిగాను కానీ, కారు కొనుక్కోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. చేసే చిన్న ఉద్యోగ౦,  గట్టిగ టిఫిన్ తింటే అయిపోయే జీతం కావడంతో, బైక్ పెట్రోల్ కే చాల ఇబ్బంది పడాల్సి వచ్చింది.  అప్పుడప్పుడు టీవీ లో మారుతీ కార్ ఆడ్ చూసేవాడిని, అందులో వర్షం పడితే,  బైక్ లు ఆగిపోతే,  కారు లో అందమైన జంట , అలా వర్షంలో  తెల్లటి కారు. అబ్బ  ఆ ఊహే మధురంగా ఉండేది.  తెల్ల కారు,  పక్కన అందమైన  అమ్మాయి, తెల్లటి మేఘాలు,  సన్నటి వర్షం, అలా కారులో,  మౌంటైన్స్ రోడ్స్లో వెళ్ళాలని చాల కోరిక! జస్ట్ కోరిక మాత్రమేనని కూడా  తెలుసు.


IT లో ఉద్యోగం వచ్చింది,  అమెరికా ఛాన్స్ కూడా వచ్చింది.  అక్కడ కారుతో చాల పని ఉంటుంది, కారు లేక పోతే ఒక్క పని కూడా చేసుకోలేము అని ఎవరో చెబితే ఎగిరి గంతేసాను. వెళ్ళగానే నేను చెయ్యాలిసిన మొదటిపని అర్ధం అయ్యింది.  అమెరికా వెళ్ళిన తర్వాత  మొదట ఒక వారం రోజులు కార్ పూల్ చేశాను.  కార్ పూల్ !- ఈ  మాటను నేను మెట్టమొదటి సారిగా అమెరికా వచ్చిన తర్వాతే విన్నాను!.   నేను అమెరికా వచ్చిన కొత్తలో,  ఆఫీసు కు వెళ్ళాలంటే నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళు.  నేను ఐదో వాడిని, టయోట కెరొల కారులో కొంచం, గట్టిగ  చెప్పాలంటే చాల ఇరుకుగా సర్దుకు కూర్చొనేవాడిని.  నా కళ్ళెప్పుడు,   కారు నడపడం మీదే  ఉండేవి,  ఎప్పడు వీలైతే అప్పడు,  ఫ్రంట్ పాసింజరు సీట్లో కూర్చొనేవాడిని.  అలా కూర్చోడానికి ఆఫీసు నుండి ఒక పది నిముషాలు ముందే బయలు దేరేవాడిని.  ఎలా నడుపుతున్నాడు , ఎక్కడ బ్రేక్  వేస్తున్నాడు, ఇలా పిచ్చి ఆలోచనలు.  ఇక లాభం లేదు అని, వచ్చిన వారం రోజులకే డ్రైవర్స్ టెస్ట్ రాత పరీక్ష అవగొట్టాను, ఇక కారు కోసం పగలు రాత్రి వెతకడం మొదలు. ఎవరో చెప్పారు ఉదయాన్నే న్యూస్ పేపర్స్ లో కార్స్ ఆడ్ పెడతారు అని.  ఉదయాన్ని మంకి కేప్ తగిలించుకొని, స్టార్ట్ tribune పేపర్ కోసం పరుగు (ఫ్రీ పేపర్ మా అపార్ట్మెంట్ లో పెట్టే వాడు!, అందుకే పరుగు!).  తర్వాత లోకల్ ఫైల్స్ అని , క్రైగ్స్ లిస్టు అని , కార్ సూప్ అని , ఏవో వెబ్సైటులు,  రాత్రి- పగలు వెతకడం, మంచి డీలు కోసం చూడడం. నా పిచ్చి కాని నాకు కంపెనీ వాళిచ్చిన అడ్వాన్స్ లోనే గొ..ప్ప డీలు తగలాలి మరి. 


ఆ రోజు రానే వచ్చింది, నా దగ్గరున్న 2000$ కి ఒక మజ్దా కారు దొరికింది.  ఏదో ఒక కారు, అదే మహా భాగ్యం అనుకొన్నాను. కొంతమంది కార్ Fax  రిపోర్ట్ చూడమన్నారు కానీ, మన బడ్జెట్ కి మిగతా ఖర్చులు ఏవి సరిపోవని వదిలేసాను. వెంటనే డబ్బులిచ్చి, కారు ఇంటిముంది పెట్టించాను. నాకు డ్రైవింగ్ రాదు కదా, అందుకే పాత  ఓనరే కారు పార్క్ చేసి వెళ్ళాడు.  ఆరోజు విచిత్రంగా రాత్రి రెండు గంటలు లేచి, మా ఆవిడను లేపాను,  "మీకు వేళ పాల  లేదా సరసానికి" అంటే, "నీ మొఖం సరసానికి కాదే, అదిగో అలా కిటికీలోంచి చూడు, ఆ వెన్నెల్లో బంగారు రంగులో మెరిసిపోతూ మన బుజ్జి గాడు  ఎంత ముదోస్తున్నాడో కదా!" అన్నాను.  "చాల్లెండి ఏమిటిది మరీ చిన్న పిల్లాడిలా? సరే ఇక  పడుకోండి" అని  తను ముసుగు తన్ని పడుకొంది.  తనని ఇక లేపలేదు. మళ్ళి మంకి కేపు, బరువైన ఒక జర్కిను వేసుకొని, ఆ చీకటిలో మెల్లగా నా కారు దగ్గరకు వచ్చి, డోర్ ఓపెన్ చేసి, నడుపుతున్నట్లు ఫీల్ అయ్యాను.  నా అదృష్టం పండి,  ఆన్ కాల్ నుండి అటువైపు వస్తూ,  ఆపి ఉన్న కారుని నడుపుతున్న నన్ను,  నా పక్క ప్రాజెక్ట్ వాళ్ళు  చూసి ఒక వెకిలి నవ్వు తో పలకరించారు.  తప్పుతుందా!, నేను కూడా  ఒక వెకిలి నవ్వు!.  అది నా జీవితంలో బరువైన రాత్రి. కళ్ళముందే కారు , కానీ నడపలేను.   తెల్ల వారింది , ఆఫీసు కు వెళ్ళాను కానీ , వర్క్ మీద మనసు లేదు, ఆ రోజు త్వరగా వచ్చేసి, మా ఫ్రెండ్ ని పట్టుకొని, వెంటనే డ్రైవింగ్ కి తీసుకెళ్ళమని అడిగాను.


అదే నేను మొదటి సారి గా నడపడం, 5  MPH స్పీడ్ లో డ్రైవ్ చేశాను. వాడు ఒకటే నవ్వు.  రెండు మూడు టిప్స్ చెప్పి, ఎలా నడపాలో నేర్పించాడు!.  ఒక్క రోజులో చాల వరకు నేర్చుకొన్నాను. అంతే ఇంకో రెండు రోజుల్లో, ఆఫీసు కి నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాను.   నా శ్రీమతిని  బతిమిలాడి, స్పీడ్ గా వెళ్లనని ఒట్టేస్తే, వచ్చి పక్కన కూర్చొంది.   డౌన్లోడ్ చేసిన మేఘాలలో తెలిపోమ్మంది అనే పాట, కొన్ని రహమాన్ పాటలు వింటూ, అలా కార్న్ ఫీల్డ్స్ మధ్యనుండి  కారు నడుపుతుంటే,  హమ్మయ్య సాధించాను అని  అనిపించింది. 


కానీ   కొన్నది కొంచెం  పాత కారేమో అప్పుడప్పుడు ఇంజన్ నుండి సౌండ్స్ వచ్చేవి, ఫర్వాలేదు అదో టైపు మ్యూజిక్ అని సరిపెట్టుకోన్న్నను. అప్పుడప్పుడు కొంచెం సేపు ఆగిపోయేది, సర్దుకు పోయాను. మొత్తానికి  ఒక మంచు రోజు చూసుకొని ( నిజమే ..మంచు రోజే ..)  ఒక సిగ్నల్ దగ్గర  టర్న్ చేస్తుంటే ఆగి పోయింది.  ఇదేమి ఖర్మర అనుకోని,   ఎవరైనా నలుగు బలంగా ఉన్నవాళ్లు తోస్తే  చాలు, మెకానిక్ దగ్గరకు పోవచ్చు అని ఒక చిన్న చిలిపి ఊహ !, అబ్బ ఎంత ఆశ! అమెరికాలో $ లేకుండా ఏపని జరగదని,  ఒక   టోవింగ్ కంపనికి కాల్ చేస్తే  వాడో వంద$ ఛార్జ్ చేసాడు.   కార్ ని tiresplus అనే షాప్ కి టో చేస్తే వాడు రెండు రకాలైన quatations ఇచ్చాడు, ఒకటి చాల అవసరం అట, ఇంకోటి వెంటనే కాక పోయిన వచ్చే వారంలోపుల చేయి౦చాలట! మొత్తం బిల్లుతో నా లాంటి కార్లు రెండు కొనచ్చు! బాబ్బాబు .. ఏదో విధం గా ప్రస్తుతానికి పని చేయించు అని రిక్వెస్ట్ చేస్తే,  ఒక రెండు గంటల్లో కారు రెడీ  చేసాడు.   మంచుతో తడిసిన, స్నో బూట్లు కన్నా, ఎస్కిమోలాంటి జర్కిన్ల కన్నా,  బిల్లు బరువగా అనిపించింది, అనిపించదా మరి!, కారు కాస్ట్ లో సగం బిల్లు మరి!.  

       
 నెలకో సారి కారు ఆగిపోవడం, దాన్ని రిపైర్ చేయించడానికి అలవాటు పడిపోయాను. కారు అమ్మైమని చాలామంది చెప్పి చూసారు. సెంటిమెంటు, నా మొదటి కారు అని ఎవ్వరి మాట వినని సీతయ్యని అయ్యాను. ఒకసారి కూర్చొని లెక్కేస్తే, అప్పటికి రిపైర్ ఖర్చుతో మూడు కార్లు కొనచ్చని తేలింది. ఐన సరే అమ్మను గాక అమ్మను అని భేస్మించుకొని కూర్చొన్నాను, కారులోనే !  ఎంత కాలం ఎదురు చూసిన కారది!

మరో నాలుగు  సంవత్సరాలు నడిపాను నా   బుజ్జి  గాడిని,  నాతో వచ్చిన వాళ్ళు ఇల్లు కొనుకొంటుంటే, వాళ్ళ ఇళ్ళకి నా పాత కారులో రానని మా ఆవిడ చెబితే,  ఇక  ఇంకో టయోట కామ్రీ కారు కొనక తప్పలేదు.   నా వైఫ్ పుట్టిన రోజు నాడు, నీకో surprise  గిఫ్ట్ అని ,  సీల్డు కవర్ లో కారు తాళాలు పెట్టి ఇచ్చాను,  నిజంగా నాకు కొత్త కారు కొన్నార అని ఆశ్చర్య పోయింది!,  తీర చూసే అవి నా పాత కారు తాళాలు. " ఇకనుంచి నువ్వు నన్ను అడగక్కరలేకుండా , నీ సొంతానికి, ఇష్టం వచ్చినట్లు  వాడుకోమని చెప్పా"ను.  మా ఆవిడ, ఆ తాళాలు గట్టిగ  విసిరితే, ఇప్పటికి కూడా దొరకలేదు. అయినా డుప్లికేట్ కీ   ఉందనుకొండి!  తను ఒక  పది రోజులు మాట్లాడలేదు అంతే, తర్వాత నా పాత కారు అప్పడప్పుడు వాడేది.  "ఏదో ఒక రోజు చూస్తూ ఉండండి,  దీన్ని ఏదో ఒక లేకు లో వదిలేసి రావడం ఖాయం" అని బెదిరించేది. నేను లైట్ తీసుకోనేవాడిని. 

 ఒక మంచు రోజు మా  బుజ్జి గాడిని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళింది, వెళ్ళడం వెళ్ళింది కానీ,  దాన్ని తిరిగి తీసుకొచ్చే ఉదేశ్యం లేనట్లు, చాల దూరం వెళ్ళింది. వెళ్ళే ముందు నాకు కానీ, నా బుజ్జి ముండకి కానీ చెప్పలేదు.  అలా  4౦ మైల్స్లో  దూరంలో నున్న  మా ఫ్రెండ్స్ ఇంటికి బయలు దేరింది.  దారిలో బుజ్జి గాడితో గొడవ పెట్టుకొంది కాబోలు,  ఆ చలిలో వెచ్చగా, షెడ్డులో  పడుకొనే నన్ను లేపి, లాంగ్ డ్రైవ్ కి తీసుకేలతవా అని బుజ్జి గాడు, shutdown  అయిపోయాడు.  వాడితో ఇంకో ప్రాబ్లం ఉంది,  వాడు సడన్ గా  ఆగిపోతే, గేరు బాక్స్ లాక్ అయిపోతుంది. నాకు మా ఆవిడ దగ్గర నుండి ఫోను. "ఈ డొక్కు కారు అమ్మేమంటే వినలేదు , చూడండి highway లో ఆగి పోయింది" అని దాదాపు అరిచినట్లు చెప్పింది. నేను వెంటనే ఆఫీసు నుండి బయలు దేరాను, వెళ్ళే సరికి నలుగురు కాప్స్ ఆ కారు గేరు బాక్స్ ఓపెన్ చెయ్యలేక నానా అవస్థలు పడుతున్నారు . కారు highway మీద ఆగి పోవడంతో,  ట్రాఫ్ఫిక్ డైవెర్ట్ చేయడానికి ఇంకో ఇద్దరిని పిలుస్తున్నారు. ఇంతలో నేను వెళ్లి నాకు అలవాటైన టెక్నిక్ తో,  గేర్ బాక్స్  unlock చేశాను.  కాప్స్ ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి థాంక్స్ చెప్పి , కేసు పెడతార అని భయపడ్డాను కానీ, అలాంటివి ఏమి లేనందుకు సంతోషించాను. 

  మా ఆవిడ  1800  junk  కి అనుకుంట  ఫోన్ చేసి, "మా దగ్గర పాత కారు ఉంది  పట్టుకు పోతార? "అని మాట్లాడుతోంది, వాడు సంతోషంగా "పట్టుకు  పోతాం!,   మీకు ౩ రోజులు ఉండేలా ౩  స్టార్ హోటల్ టికెట్స్ ఇస్తాం,   లేక పోతే  500 $ వరకు  tax బెనిఫిట్ వచ్చేల చేస్తాం, లేక పోతే 100  $ ఇన్స్టంట్ కాష్ ఇస్తాం",  లాంటి  ఆఫర్ లు చేసారు. నేను వెంటనే ఫోన్ లాక్కొని, "థాంక్స్" చెప్పి పెట్టేసాను.  "నా సెంటిమెంట్ కారు, కొంచెం పాడైందని, టో చేస్తావ? మర్చి పోయావ? ఇన్నాళ్ళు  మనకెంత సేవా చేసిందో" అని పెద్ద క్లాసు తీసుకొన్నాను. తను వద్దంటున్న వినకుండా  పక్కనే ఉన్న రిపైర్ షాప్ కి టో  చేయించాను. టో కి ఒక 50 $ పైనే అయ్యాయి. ఆ షాప్ వాడు, దీనికి పెద్ద ప్రాబ్లం ఉంది ఒక 1000 $ వరకు అవుతాయని చెప్పాడు.  ఇక మా ఆవిడ ఊరు కోలేదు, "దీనికి ఇప్పటికైనా అమ్ముతార ? లేదా" అని ఒకటే పోరు.  "చూడు సఖి, ఈ రిపైర్ షాప్ వాడికి సరిగ్గ్గా తెలిసినట్టు లేదు,  ఒక్కసారి షో రూం కి తీసుకేల్లానంటే, వాడి యిట్టె  బాగు చేస్తాడు" అని ఒప్పించి, ఇంకో 100 $ ఇచ్చి అక్కడనుండి షో రూం కి టో చేయించాను.

      మజ్ద షో రూం కే వెళ్లి కారు రిపైర్ కి estimate  అడిగాను, వాడు కంప్లేటు  చెక్ చేయడానికి 250 $ ఛార్జ్ అని చెప్పాడు,  తర్వాత estimation  ఇస్తాము అన్నాడు,  మా ఆవిడ మొఖం ఇంకో సారి చూడలేక పోయాను. ఇంతలో మళ్ళి ఫోన్, 1800  జంక్ వాడే, ఈసారి మీకో 10 $ గిఫ్ట్ కార్డు కూడా ఇస్తాం అని బేరం ఆడుతున్నాడు. నేను ఫోన్ పవర్ ఆఫ్ చేశాను.  షో రూం వాడితో "మా  బుజ్జ్జి గాడిని గౌరవంగా సాగనంపె మార్గం ఉందా "అని అడిగాను.  వాడు, "మీకు నచ్చితే డొనేట్ చెయ్యండి", ఎవరినా పేదవాళ్ళు వాడుకొంటారు అని చెప్పాడు. నాకు ఆ సలహా చాల బాగా నచ్చింది.  ఇంటికి వెళ్లి డొనేట్ చెయ్యన, లేక ఒక 1000 $ పెట్టి రిపైర్ చేయించన అని చాల ఆలోచించాను. కానీ చాల ఎక్కవ ఆలోచించాను, ఒక వారం దాటింది,  రెండు వారాలు దాటాయి,  ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అని వాయిదాలు వేసాను. ఒకరోజు   టోఇంగు కంపెనీ నుండి లెటర్ వచ్చింది, అందులో "మీ కారు మా దగ్గరుండి, దయచేసి 2500 $ కట్టి తీసుకెళ్ళండి" అని ఉంది. నేను హడావిడిగా మజ్దా షోరూం  కి పరిగెట్టాను, వాళ్ళు "మీ కోసం రెండు రోజులు చూసాం, రాక పోయేసరికి  టో చేసాం",  "మీ ఫోన్ రాలేదు, ఇక మేము ఏమి చెయ్యలేము"  అని కూల్ గా చెప్పారు.  టొ కంపెనీ కి ఫోన్ చేశాను, "కారు కొన్నప్పుడే దానిఖరీదు 2500 $ లేదు" అని మొత్తు కొన్న టొ కంపనీ వాడు వినలేదు. "మీ కారుకు పదిహేను రోజులనుండి మాదగ్గర ఉంచినందుకు డబ్బులు కట్టాలి అన్నాడు".   అలా కాదు ఇంకో మాట చెప్పమంటే వాడు సరే ఒక  250 $ కట్టి కారు మర్చిపోండి అని చెప్పాడు.  కారులో ఉన్న ప్రతి వస్తువు వాడిదే నట, ఆఖరకు చిన్నపిల్లల piano , సగం తిన్న మొక్క జొన్న పొత్తులు ,  పాత  కరెంటు బిల్లులు, స్పేరు టైరు,.. ఒకటేమిటి మొత్తం అన్ని వాడివే.  నేను మా ఆవిడకు రాసిన కవితల పుస్తకం కూడా వాటిలోనే ఉంది.  మా ఆవిడతో ఆ  విషయం చెప్పి, ఒక్కసారి కారుని చివరిసారిగా  కనీసం ఫోటో ఐన తీసుకుంటాను అంటే, వళ్ళు మండి 50 $ ఫోన్ నేలకేసి బాది, తన క్రెడిట్ కార్డుతో టో కంపెనీ కి డబ్బులు కట్టి , ఆ రోజు సంతోషంగా నిద్ర పొయింది, నాకు రాత్రంతా కల్లో నా పాత కారే. కొన్ని బంధాలు ద్రుడమైనవి.  తర్వాత ఇంటర్నెట్ లో VIN నెంబర్ తో సెర్చ్ చేస్తే, నా కారు కొత్త ఓనర్  దగ్గర ఉంది, అదేక్కడున్న దాని సంతోషమే నా సంతోషం. ప్రతి దసరాకు దాని పేరు మీద కూడా పూజ, దాని ఫొటోకో రోజా! నువ్వేక్కడున్న వర్ధిల్లు నేస్తం. 


అబ్బే ఏమిలేదు హనీ .., సరదాగా ఒక జరిగిన కధ రాస్తున్నానంతే!,  అబ్బే.. కారా..? అలాంటిది ఏమిలేదు , వచ్చేస్తున్నా .. సరే మరిక ఉంటానండి, మా ఆవిడ భోజనానికి పిలుస్తోంది. 
     




Wednesday, January 5, 2011

హిందూ మతంలో నేను ఇంతవరకు నేర్చుకోన్నదేమిటి?

ఒక్క సారి మన హిందూ మతం గురించి ఆలోచిస్తే, అసలు నేను ఇన్ని సంవత్సరాల నుండి ఏమిటి నేర్చుకొన్నాను అని అనిపిస్తోంది? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి వయసు ఉంటుంది,  రోజు గడిస్తే ఆ వయసు ఇంకొక్క  రోజు పెరుగుతుంది. ఈ భూమి వయసు  పెరుగుతుంది, సముద్రం వయసు, మనుషుల వయసు, చెట్టు చేమ  ఒక్కటేమిటి ఈ సమస్త విశ్వంలో ప్రతి పరమాణువు వయసు పెరుగుతుంది.  పెరిగిన వాటికి అనుభవం  ఎక్కువంటారు.  రోజు గడిస్తే సముద్రం ఎక్కువ ఉప్పగా అవుతుంది, భూమి మరింత బరువవుతుంది, మనిషికి జ్ఞానం పెరుగుతుంది, అప్పులకు వడ్డీ పెరుగుతుంది,  ఇలా చాల విషయాలు పెరుగుతాయి. మరి నా  భక్తి పెరిగిందా? పెరుగుతుందా ? పెరిగే అవకాసం ఉందా?


నా చిన్నతనంలో  దీపావళి అంటే చెప్పిన కధ గుర్తొస్తోంది.  నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు , అతనితో కృష్ణుడు యుద్ధం చేసాడు, మధ్యలో చెయ్యలేకపోతే, కృష్ణుని భార్య సత్యభామ బాణం తీసుకొని , నరకాసురుని వధించింది, దానితో ప్రజలందరూ సంతోషంతో అమావాస్య చీకట్లు పోగ్గొట్టి (రాక్షసుడిని అమావాస్య రోజు చంపి) వెలుగు నింపిన (తన బాణాలతో వచ్చిన వెలుగు అని ఇంకో అర్ధం!) రోజు కనుక దీపావళి జరుపుకొంటాం. ఇప్పటికీ ఇదే కధని  దాదాపు అటు,ఇటుగా పిల్లలకు చెబుతారు.  కధ సంగతి సరే కానీ,  ప్రతి దీపావలి  పండుగకు మనం చేయాల్సింది ఏమిటి అంటే,  ఉదయం షుస్ట్టుగా భోజనం చేయడం,  బైటకు వెళ్లి సంచి నిండా టపాకాయలు కొని తేవడం, కాల్చడం.  కొన్ని దశాబ్దాలు క్రితం అంతే, ఒక 50  సంవత్సరాల క్రితం అంతే,  ఇప్పడు కూడా ఇంతే!. ఇక ముందు కూడా అంతే.


సంక్రాంతి రోజుల్లో కూడా ఇదే తంతు.   భోగి నాడు భోగి పళ్ళు, కనుమ రోజు, తిన్న వాళ్ళకి  కక్క ముక్క , సంక్రాంతి రోజు కొత్త బట్టలు, ఈ మూడు రోజుల్లో ఒకటొ రెండో సినిమాలు.  కాల్చే బాణసంచాలు మారొచ్చు గాక, వండే వంటకాలు మారొచ్చు గాక, బట్టల డిజైన్లు మారొచ్చు గాక, మన ఆలోచనలలో మార్పు లేదు.  పండుగ అంటే, వండుకోవడం, సినిమా చూడడం, వీలైతే పేక ఆడడం, బలవంతపు జోకులు చెప్పుకొని నవ్వుకోవడం, ఇవే మన పండగలు అని  మన పిల్లలకు నేర్పించడం!.


నిజానికి పండుగ అంటే ఎవరికి తెలుసు?  ఎవరైనా చెప్పిన ఎంత మంది తలకేకిన్చుకోగలరు?  కొంచెం పురాణాలూ తెలిసిన వాళ్ళని గట్టిగ అడిగితే, సంక్రాంతి అంతే సూర్యుడు మకరరాసిలోకి వస్తాడు, దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది అంటారు.  కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మకర రాశిలోకి వస్తున్నాడు, మనం పిలుచుకొనే ఉత్తరాయణం , దక్షిణాయనం సృష్టి మొదటి నుండి ఉన్నాయి,  అయినా సంక్రాంతి ఎప్పడు మొదలైందో?  మన పెద్దలు ఎన్నో ఆలోచించి మనకు పండుగలు పెట్టరనుకొందాము, సరే వాళ్ళు మనకు చెప్పిన దేమిటి?  అట్ల తద్ది రోజు, పూటుగా అట్లు పోసుకు తినండి, కనుమ రోజు మేకలు కొట్టండి, దీపావళికి బాణసంచ కాల్చండి, నాగుల చవితో రోజు చలిమిడి తినండి, శ్రీరామ నవమి రోజు పానకం తాగండి, బోగి రోజు పాత సామాన్లు కాల్చండి ఇలాంటివి చెప్పారా?  లేక  మనం మాత్రం ఇవే వంట బట్టించు కొన్నామా?  పండుగ అంటే తిండి, కొత్త బట్టలు, విందులు వినోదాలు గా మన మతాన్ని మార్చిన వాళ్ళెవరు? మన తర్వాత తరాలకు కూడా ఇదే సంప్రదాయం అందిస్తామా?


ఇందులో తప్పేంటని  మీ అనుమానం కదూ?  పండగ ఉన్నదే తినడానికి, నలుగురితో సరదాగా గడపడానికి,  అని మీ అభిప్రాయం అయితే ఇక వాదన లేదు.  సరదాగా గడపడం ఎన్నటికి తప్పు కాదు,  అలా గడపడానికి పండగను అడ్డుపెట్టుకుంటున్న వాళ్ళతో మనకు వాదన లేదు. పండగ రోజున మనం ఏమి నేర్చుకొంటున్నాము?  ఒక్క టంటే ఒక్క  కొత్త విషయం? పది సంవత్సరాల క్రితం సంక్రాంతికి, ఇప్పటికి నేను ఏమిటి నేర్చుకొన్నాను? మన హిందూ మత పరంగా? ఒక్క కొత్త మంత్రం? ఒక పూజ విధానం?  నా   పండుగల వయసు కొన్ని దశాబ్దాలు పెరిగింది కదా,  మరి మన మతంలో ఉంటూ నా  భక్తి పెరిగిందా?  నేర్చు కోవడానికి అసలు ఏముంది కనుక? అని అనుమానం తెప్పించారు.  ప్రతిసారి గుడికి వెళ్ళడం, కళ్ళు మూసుకొని ఒక అరక్షణం ప్రార్ధించడం, అటునుండి అటే సినిమాకో, హోటల్ కో వెళ్ళడం!


ఈ ప్రపంచంలో అతి సులువైన మతం హిందూ మతం అని నా కనిపిస్తుంది.  పండగ వచ్చిందా, నీకు అస్సలు శ్రమ లేదు, కొత్త బట్టలున్నాయా? పిండివంటలు చేయగలవా? నువ్వు పాస్ అయిపోయావు, దిగ్విజయంగా పండగ జరుపుకో!  నువ్వు ఎలాంటి మంత్రాలు చదవక్కరలేదు, ఎలాంటి పూజ విధానం తెలుసు కోవక్కరలేదు, ధ్యానం తో అస్సలు పనిలేదు, నీకు మానసిక శక్తి నిచ్చే ప్రాణాయామం తో పనిలేదు,  మహా ఐతే రెండు మూడు  పేజిలున్న వ్రత కధ ఒకటి దగ్గర పెట్టుకో, లేక పోయిన నష్టం లేదు.  మన దేవుడికి ఒక్క బెల్లం ముక్కైన చాలు.  పండగ ఘనం గా ఉండాలంటే  గుడికి వెళితే సరి!.  ఏమిటి గుడికి ఏ పుస్తకం తీసుకెళ్లాలా? బాబు.., మనది హిందూ మతం, మన తప్పులు క్షమించడానికి శతకోటి దేవుళ్ళు,  అయినా బడికి పుస్తకం కానీ గుడికేమిటి..? జేబులో ఒక వంద నోటు ఉందా.?, నువ్వు సాధించావు పో.., ఇక నీ పాపాలన్నీ ఆ గంగలో కలిసినట్టే!,  వంద నోటు తీసుకెళ్ళి ఒక్క అర్చన టికెట్ కొను,  అభిషేకం అయితే మరి మంచిది,  నీ పాపాలన్నీ పోగొట్టే భారం మరిక పూజారిదే!, వందనోటు మహిమోయ్!, పైసా లో పరమాత్మ ఉండడం అంటే ఏమిటి అనుకొన్నావు?  పూజారి ఒక్కసారి మైక్ లో నీ పేరు, గోత్రం చదివేవరకు ఉండు, చదివిన తర్వాత నువ్వు అక్కడ లేక పోయిన ఫర్వాలేదు, అసలు పోస్టల్ పూజలు, ఇంటర్నెట్ పూజలు కూడా వచ్చాయో య్, నువ్వు రావలిసిన పని లేదసలు.  పూజారి చదివేది నీకు ఒక్క ముక్క అర్ధం కావక్కరలేదు, చివరాఖరికి తీర్ధం పుచ్చుకో,  ప్రసాదం  కళ్ళ కద్దుకొని, ఒక్క కొబ్బరి ముక్క అలా నోట్లో వేసుకోన్నవంటే, సర్వపాపాలు 'హరి' మనవూ?  ఆ పూజేదో చేసేసుకొంటే, ఇక నీ భోజనాలు, సినిమాలు , షికార్ల మీద పడొచ్చు, షరా మాములే!.  ఇప్పుడు చెప్ప్పు  ఇన్ని డిస్కౌంట్లు నీకు ఏ మతంలో ఉన్నాయి?  అందుకే కదూ దశాబ్దాలు  గడిచిన, మనకు ఆయువు పట్టు లాంటి వేదంలో ఒక్క ముక్క నేర్చుకోలేక పోయాను. గుడికి వెళ్ళాలంటే భక్తి కన్నా ముందు ఒక పది రూపాయలుండాలి అనే స్థితికి వచ్చాను. అభిషేకం, అర్చన,  నా పాపాలు పోగొడతాయి అని నన్ను ఎవరు నమ్మించారు?  నా దగ్గర కొన్ని వందల రూపాయలు,  తీసుకొని నా మతం నాకు ఇచ్చిన దేమిటి?  సగం కొబ్బరి ముక్కలు, కొన్ని అరటిపళ్ళు.  ఒక్క మంత్రం నా చేత చదివించలేదు, (అప్పుడప్పుడు ఇంట్లో చేయించిన పూజలో   "మమ" అన్నట్లు గుర్తు).  ప్రాణాయామం అని చెప్పి ౩ సార్లు ముక్కు మూయించిన  గుర్తు,  అంతే నేను నేర్చు కొన్నది. 

గుడి కెళితే,  మతానికి డబ్బుకి ముడి పెట్టిన వాళ్ళెవరు?  గుడికి వచ్చే భక్తులను,  sponsors గాను నాన్ sponsors గాను విడగొట్టి, వాళ్ళని వేరు వేరు వరసల్లో నిలిపేది ఎవరు? మన చేత  ధ్యానం చేయి౦చకుండ , పట్టుమని పది నిముషాలైన ప్రాణాయామం   చేయి౦చకుండ,  నోటితో ఒక్క మంత్రం పలికించకుండా, కనీసం గట్టిగ నమ్హ శివాయ అనిగాని,  గోవిందా.. గోవింద అని గాని అనిపించకుండా,  దృష్టంతా మన అర్చన , అభిషేకం, కళ్యాణం టికెట్ల మీద పెట్టెదేవరు?   మనం సేవల టికెట్స్ కొసం ఎదురు చూసి, ఒకరిద్దరు టికెట్స్ తెచ్చి ఇవ్వగానే పూజ మొదలు పెట్టేదెవరు?  మనకు గుడిలో ఒక్క మంత్రం ఏ పూజారైన  నేర్పాడ?  కనీసం ఏనాడైనా దేవుడికి  నైవేద్యం పెట్టడం ఎలాగో నేర్పార?  ప్రతి చోట తొందర, పూజ తొందరగా ముగిసి పోవాలి, త్వరగా ఇంటికి వెళ్లి పోవాలి లేక సినిమాకు వెళ్ళాలి అని ఆలోచించే భక్తులు కూడా ఉన్నారు.  గట్టిగ అరగంట ధ్యానం లో కూర్చొనే ఓపిక ఉండే భక్తులు ఎంతమంది ఉన్నారు?  వీళ్ళకి తగ్గట్టే, గుడిని కూడా బిజినెస్ గా మార్చి, భక్తులను ఆకట్టుకోవడానికి ఎన్ని ట్రిక్కులు! ఇక గుడికి వెళితే ప్రశాంతత ఎలా వస్తుంది?  నా మాటకు నేను, ఒక అజ్ఞానిలా గుడికి వెళ్ళాలి, ఒక్క భక్తి తో మాత్రమే వెళ్ళాలి, ఎటువంటి రొక్కం లేకుండా దేవుడిని దర్శించుకోవాలి, తిరిగి గుడినుండి వచ్చేటప్పుడు, ప్రశాంతమైన మనసుతో రావాలి, నా ముఖంలో కొత్త విషయం నేర్చుకొన్నాను అన్న ఆనందం కలగాలి, నేను నేర్చుకొన్న విద్య మొరోకరితో పంచుకోనేదిగా ఉండాలి, నాకు అవసరానికి అక్కరకు రావాలి.  ఇవన్ని జరిగే గుడి ఏమిటో మీకు తెలుసా? లేక మనమే సులువైన మార్గాలు ఎన్నుకొని, టికెట్ కొంటె చాలు, పుణ్యం వస్తుందని, మన మంచి చెడ్డలు పూజారి చూసుకొంటదాని  ఇలా అలవాటు పడ్డామ?

సప్త సముద్రాల లోతు కలిగిన విజ్ఞానం ఉన్న నా మతం నుండి నేను ఎందుకు ఏమి నేర్చుకోలేక పోయాను?  అవును తప్పు నాలోనే ఉందా? నేను ఇప్పుడు గుడికి వెళితే జరిగేది ఏమిటో నాకు ముందే తెలుసు. ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అర్చన, కళ్యాణం, అభిషేకం టికెట్స అమ్ముతారు, ఏదో ఒకటి కొనాలి అంతే. అలా కాకుండా ఏదైనా ధర్మ సందేహాలు నివృతి చేసుకోవడానికి గుడికి వెళ్ళే రోజులు పోయాయి.  పూర్వం గుడిలో  యోగులు, యోగ భ్యాసం , మంత్రం, ధ్యానం నేర్పెవాళ్ళట!,  ఒకరో ఇద్దరో యోగులు నిత్యం ఉండే వాళ్ళట!, కాషాయ బట్టల్లో తెల్లగా నెరిసిన గడ్డంతో ఉన్న నిజమైన ఋషులను గురించి కధల్లో చదవటం తప్ప గుళ్ళలో చూసిన గుర్తు లేదు. అయినా.. గుడిని కూడా బిజినెస్ గా నడుపుతుంటే , ఇక్కడకు ఋషులు  ఎవరు వస్తారు?  వస్తే ఋషుల ముసుగులో  స్వామిజిలు రావాలి.  వాళ్ళ ఖర్చులు కూడా టెంపుల్ వాళ్ళే పెట్టుకోవాలి!.  నాకు మాత్రం నేనొక అర్చన టికెట్ కొనే యంత్రం గా మిగల దలుచుకోలేదు!,  నాకు నేర్చుకోవాలనుంది, మన కష్టాలను తీర్చి, సుఖాల తీరం చేర్చే వేదాల్లో ఉన్న మంత్రాలను నా నోటితో పలకాలనుంది.  నేను దేవుడిని తెలుసు కోవాలంటే అది నా మనసు దేవుని మీద పెట్టి చేసే  ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. నేను నేర్చుకొనే మంత్రాలు నాకు మానసిక శక్తి ప్రసాదించు గాక, నా ధ్యానం నాకు ప్రశాంతత చేకూర్చు గాక.  హిందూ మతం లో సారాన్ని వదిలి, దానికి  ఎంతో సులువైనది గా మార్చి, కేవలం నేను కొన్న అర్చన టికెట్ నాకు మోక్షం ప్రసాదిస్తుంది అన్న బ్రమలు నాకు కలగకుండు గాక.