నాకు చిన్నప్పటి నుండి కారు కానీ, జీప్ కానీ నడపాలని ఎంతో కోరిక. చిన్నప్పుడు మా పక్కింటివాళ్ళ చుట్టాలు జీప్ లో ఒరిస్సా నుండి వచ్చి మా ఇంటి ముందర పార్క్ చేసుకోనేవాళ్ళు. మా నాన్నని , "నన్ను తెల్లవారి నాలుగు గంటలకే లేప" మని, వెంటనే జీప్ లో దూరి పోయేవాడిని. పదినిముషాలు అని చెప్పి, ఒక అరగంట ఆడుకొని నిజంగానే నడిపినట్లు ఫీల్ అయ్యేవాడిని. పాపం తెల్లవారి చూస్తె, గేరులు మరి పోయి, లైట్ స్విచ్లు ఆన్ అయి, ఒక రకం గా ఉండేది జీప్. చేసింది నేనే నని తెలిసి, " ఇంకోసారి ఇలా పాడుచేస్తే జీప్ ఇక్కడే వదిలేస్తాం" అంటే, నిజమనుకొని, నాన్న .."జీప్ ఫుల్ గా పాడు చేస్తా "అని ఏడ్చినట్లు గుర్తు! ఆ ఏడుపుకు మిగతావల్లంతలా ఎందుకు నవ్వారో నాకు అప్ప్దుడు తెలీలేదు.
విశాఖపట్నంలో బైక్ మీద ఎన్నో వేళ మైళ్ళు తిరిగాను కానీ, కారు కొనుక్కోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. చేసే చిన్న ఉద్యోగ౦, గట్టిగ టిఫిన్ తింటే అయిపోయే జీతం కావడంతో, బైక్ పెట్రోల్ కే చాల ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు టీవీ లో మారుతీ కార్ ఆడ్ చూసేవాడిని, అందులో వర్షం పడితే, బైక్ లు ఆగిపోతే, కారు లో అందమైన జంట , అలా వర్షంలో తెల్లటి కారు. అబ్బ ఆ ఊహే మధురంగా ఉండేది. తెల్ల కారు, పక్కన అందమైన అమ్మాయి, తెల్లటి మేఘాలు, సన్నటి వర్షం, అలా కారులో, మౌంటైన్స్ రోడ్స్లో వెళ్ళాలని చాల కోరిక! జస్ట్ కోరిక మాత్రమేనని కూడా తెలుసు.
IT లో ఉద్యోగం వచ్చింది, అమెరికా ఛాన్స్ కూడా వచ్చింది. అక్కడ కారుతో చాల పని ఉంటుంది, కారు లేక పోతే ఒక్క పని కూడా చేసుకోలేము అని ఎవరో చెబితే ఎగిరి గంతేసాను. వెళ్ళగానే నేను చెయ్యాలిసిన మొదటిపని అర్ధం అయ్యింది. అమెరికా వెళ్ళిన తర్వాత మొదట ఒక వారం రోజులు కార్ పూల్ చేశాను. కార్ పూల్ !- ఈ మాటను నేను మెట్టమొదటి సారిగా అమెరికా వచ్చిన తర్వాతే విన్నాను!. నేను అమెరికా వచ్చిన కొత్తలో, ఆఫీసు కు వెళ్ళాలంటే నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళు. నేను ఐదో వాడిని, టయోట కెరొల కారులో కొంచం, గట్టిగ చెప్పాలంటే చాల ఇరుకుగా సర్దుకు కూర్చొనేవాడిని. నా కళ్ళెప్పుడు, కారు నడపడం మీదే ఉండేవి, ఎప్పడు వీలైతే అప్పడు, ఫ్రంట్ పాసింజరు సీట్లో కూర్చొనేవాడిని. అలా కూర్చోడానికి ఆఫీసు నుండి ఒక పది నిముషాలు ముందే బయలు దేరేవాడిని. ఎలా నడుపుతున్నాడు , ఎక్కడ బ్రేక్ వేస్తున్నాడు, ఇలా పిచ్చి ఆలోచనలు. ఇక లాభం లేదు అని, వచ్చిన వారం రోజులకే డ్రైవర్స్ టెస్ట్ రాత పరీక్ష అవగొట్టాను, ఇక కారు కోసం పగలు రాత్రి వెతకడం మొదలు. ఎవరో చెప్పారు ఉదయాన్నే న్యూస్ పేపర్స్ లో కార్స్ ఆడ్ పెడతారు అని. ఉదయాన్ని మంకి కేప్ తగిలించుకొని, స్టార్ట్ tribune పేపర్ కోసం పరుగు (ఫ్రీ పేపర్ మా అపార్ట్మెంట్ లో పెట్టే వాడు!, అందుకే పరుగు!). తర్వాత లోకల్ ఫైల్స్ అని , క్రైగ్స్ లిస్టు అని , కార్ సూప్ అని , ఏవో వెబ్సైటులు, రాత్రి- పగలు వెతకడం, మంచి డీలు కోసం చూడడం. నా పిచ్చి కాని నాకు కంపెనీ వాళిచ్చిన అడ్వాన్స్ లోనే గొ..ప్ప డీలు తగలాలి మరి.
ఆ రోజు రానే వచ్చింది, నా దగ్గరున్న 2000$ కి ఒక మజ్దా కారు దొరికింది. ఏదో ఒక కారు, అదే మహా భాగ్యం అనుకొన్నాను. కొంతమంది కార్ Fax రిపోర్ట్ చూడమన్నారు కానీ, మన బడ్జెట్ కి మిగతా ఖర్చులు ఏవి సరిపోవని వదిలేసాను. వెంటనే డబ్బులిచ్చి, కారు ఇంటిముంది పెట్టించాను. నాకు డ్రైవింగ్ రాదు కదా, అందుకే పాత ఓనరే కారు పార్క్ చేసి వెళ్ళాడు. ఆరోజు విచిత్రంగా రాత్రి రెండు గంటలు లేచి, మా ఆవిడను లేపాను, "మీకు వేళ పాల లేదా సరసానికి" అంటే, "నీ మొఖం సరసానికి కాదే, అదిగో అలా కిటికీలోంచి చూడు, ఆ వెన్నెల్లో బంగారు రంగులో మెరిసిపోతూ మన బుజ్జి గాడు ఎంత ముదోస్తున్నాడో కదా!" అన్నాను. "చాల్లెండి ఏమిటిది మరీ చిన్న పిల్లాడిలా? సరే ఇక పడుకోండి" అని తను ముసుగు తన్ని పడుకొంది. తనని ఇక లేపలేదు. మళ్ళి మంకి కేపు, బరువైన ఒక జర్కిను వేసుకొని, ఆ చీకటిలో మెల్లగా నా కారు దగ్గరకు వచ్చి, డోర్ ఓపెన్ చేసి, నడుపుతున్నట్లు ఫీల్ అయ్యాను. నా అదృష్టం పండి, ఆన్ కాల్ నుండి అటువైపు వస్తూ, ఆపి ఉన్న కారుని నడుపుతున్న నన్ను, నా పక్క ప్రాజెక్ట్ వాళ్ళు చూసి ఒక వెకిలి నవ్వు తో పలకరించారు. తప్పుతుందా!, నేను కూడా ఒక వెకిలి నవ్వు!. అది నా జీవితంలో బరువైన రాత్రి. కళ్ళముందే కారు , కానీ నడపలేను. తెల్ల వారింది , ఆఫీసు కు వెళ్ళాను కానీ , వర్క్ మీద మనసు లేదు, ఆ రోజు త్వరగా వచ్చేసి, మా ఫ్రెండ్ ని పట్టుకొని, వెంటనే డ్రైవింగ్ కి తీసుకెళ్ళమని అడిగాను.
అదే నేను మొదటి సారి గా నడపడం, 5 MPH స్పీడ్ లో డ్రైవ్ చేశాను. వాడు ఒకటే నవ్వు. రెండు మూడు టిప్స్ చెప్పి, ఎలా నడపాలో నేర్పించాడు!. ఒక్క రోజులో చాల వరకు నేర్చుకొన్నాను. అంతే ఇంకో రెండు రోజుల్లో, ఆఫీసు కి నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాను. నా శ్రీమతిని బతిమిలాడి, స్పీడ్ గా వెళ్లనని ఒట్టేస్తే, వచ్చి పక్కన కూర్చొంది. డౌన్లోడ్ చేసిన మేఘాలలో తెలిపోమ్మంది అనే పాట, కొన్ని రహమాన్ పాటలు వింటూ, అలా కార్న్ ఫీల్డ్స్ మధ్యనుండి కారు నడుపుతుంటే, హమ్మయ్య సాధించాను అని అనిపించింది.
కానీ కొన్నది కొంచెం పాత కారేమో అప్పుడప్పుడు ఇంజన్ నుండి సౌండ్స్ వచ్చేవి, ఫర్వాలేదు అదో టైపు మ్యూజిక్ అని సరిపెట్టుకోన్న్నను. అప్పుడప్పుడు కొంచెం సేపు ఆగిపోయేది, సర్దుకు పోయాను. మొత్తానికి ఒక మంచు రోజు చూసుకొని ( నిజమే ..మంచు రోజే ..) ఒక సిగ్నల్ దగ్గర టర్న్ చేస్తుంటే ఆగి పోయింది. ఇదేమి ఖర్మర అనుకోని, ఎవరైనా నలుగు బలంగా ఉన్నవాళ్లు తోస్తే చాలు, మెకానిక్ దగ్గరకు పోవచ్చు అని ఒక చిన్న చిలిపి ఊహ !, అబ్బ ఎంత ఆశ! అమెరికాలో $ లేకుండా ఏపని జరగదని, ఒక టోవింగ్ కంపనికి కాల్ చేస్తే వాడో వంద$ ఛార్జ్ చేసాడు. కార్ ని tiresplus అనే షాప్ కి టో చేస్తే వాడు రెండు రకాలైన quatations ఇచ్చాడు, ఒకటి చాల అవసరం అట, ఇంకోటి వెంటనే కాక పోయిన వచ్చే వారంలోపుల చేయి౦చాలట! మొత్తం బిల్లుతో నా లాంటి కార్లు రెండు కొనచ్చు! బాబ్బాబు .. ఏదో విధం గా ప్రస్తుతానికి పని చేయించు అని రిక్వెస్ట్ చేస్తే, ఒక రెండు గంటల్లో కారు రెడీ చేసాడు. మంచుతో తడిసిన, స్నో బూట్లు కన్నా, ఎస్కిమోలాంటి జర్కిన్ల కన్నా, బిల్లు బరువగా అనిపించింది, అనిపించదా మరి!, కారు కాస్ట్ లో సగం బిల్లు మరి!.
నెలకో సారి కారు ఆగిపోవడం, దాన్ని రిపైర్ చేయించడానికి అలవాటు పడిపోయాను. కారు అమ్మైమని చాలామంది చెప్పి చూసారు. సెంటిమెంటు, నా మొదటి కారు అని ఎవ్వరి మాట వినని సీతయ్యని అయ్యాను. ఒకసారి కూర్చొని లెక్కేస్తే, అప్పటికి రిపైర్ ఖర్చుతో మూడు కార్లు కొనచ్చని తేలింది. ఐన సరే అమ్మను గాక అమ్మను అని భేస్మించుకొని కూర్చొన్నాను, కారులోనే ! ఎంత కాలం ఎదురు చూసిన కారది!
మరో నాలుగు సంవత్సరాలు నడిపాను నా బుజ్జి గాడిని, నాతో వచ్చిన వాళ్ళు ఇల్లు కొనుకొంటుంటే, వాళ్ళ ఇళ్ళకి నా పాత కారులో రానని మా ఆవిడ చెబితే, ఇక ఇంకో టయోట కామ్రీ కారు కొనక తప్పలేదు. నా వైఫ్ పుట్టిన రోజు నాడు, నీకో surprise గిఫ్ట్ అని , సీల్డు కవర్ లో కారు తాళాలు పెట్టి ఇచ్చాను, నిజంగా నాకు కొత్త కారు కొన్నార అని ఆశ్చర్య పోయింది!, తీర చూసే అవి నా పాత కారు తాళాలు. " ఇకనుంచి నువ్వు నన్ను అడగక్కరలేకుండా , నీ సొంతానికి, ఇష్టం వచ్చినట్లు వాడుకోమని చెప్పా"ను. మా ఆవిడ, ఆ తాళాలు గట్టిగ విసిరితే, ఇప్పటికి కూడా దొరకలేదు. అయినా డుప్లికేట్ కీ ఉందనుకొండి! తను ఒక పది రోజులు మాట్లాడలేదు అంతే, తర్వాత నా పాత కారు అప్పడప్పుడు వాడేది. "ఏదో ఒక రోజు చూస్తూ ఉండండి, దీన్ని ఏదో ఒక లేకు లో వదిలేసి రావడం ఖాయం" అని బెదిరించేది. నేను లైట్ తీసుకోనేవాడిని.
ఒక మంచు రోజు మా బుజ్జి గాడిని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళింది, వెళ్ళడం వెళ్ళింది కానీ, దాన్ని తిరిగి తీసుకొచ్చే ఉదేశ్యం లేనట్లు, చాల దూరం వెళ్ళింది. వెళ్ళే ముందు నాకు కానీ, నా బుజ్జి ముండకి కానీ చెప్పలేదు. అలా 4౦ మైల్స్లో దూరంలో నున్న మా ఫ్రెండ్స్ ఇంటికి బయలు దేరింది. దారిలో బుజ్జి గాడితో గొడవ పెట్టుకొంది కాబోలు, ఆ చలిలో వెచ్చగా, షెడ్డులో పడుకొనే నన్ను లేపి, లాంగ్ డ్రైవ్ కి తీసుకేలతవా అని బుజ్జి గాడు, shutdown అయిపోయాడు. వాడితో ఇంకో ప్రాబ్లం ఉంది, వాడు సడన్ గా ఆగిపోతే, గేరు బాక్స్ లాక్ అయిపోతుంది. నాకు మా ఆవిడ దగ్గర నుండి ఫోను. "ఈ డొక్కు కారు అమ్మేమంటే వినలేదు , చూడండి highway లో ఆగి పోయింది" అని దాదాపు అరిచినట్లు చెప్పింది. నేను వెంటనే ఆఫీసు నుండి బయలు దేరాను, వెళ్ళే సరికి నలుగురు కాప్స్ ఆ కారు గేరు బాక్స్ ఓపెన్ చెయ్యలేక నానా అవస్థలు పడుతున్నారు . కారు highway మీద ఆగి పోవడంతో, ట్రాఫ్ఫిక్ డైవెర్ట్ చేయడానికి ఇంకో ఇద్దరిని పిలుస్తున్నారు. ఇంతలో నేను వెళ్లి నాకు అలవాటైన టెక్నిక్ తో, గేర్ బాక్స్ unlock చేశాను. కాప్స్ ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి థాంక్స్ చెప్పి , కేసు పెడతార అని భయపడ్డాను కానీ, అలాంటివి ఏమి లేనందుకు సంతోషించాను.
మా ఆవిడ 1800 junk కి అనుకుంట ఫోన్ చేసి, "మా దగ్గర పాత కారు ఉంది పట్టుకు పోతార? "అని మాట్లాడుతోంది, వాడు సంతోషంగా "పట్టుకు పోతాం!, మీకు ౩ రోజులు ఉండేలా ౩ స్టార్ హోటల్ టికెట్స్ ఇస్తాం, లేక పోతే 500 $ వరకు tax బెనిఫిట్ వచ్చేల చేస్తాం, లేక పోతే 100 $ ఇన్స్టంట్ కాష్ ఇస్తాం", లాంటి ఆఫర్ లు చేసారు. నేను వెంటనే ఫోన్ లాక్కొని, "థాంక్స్" చెప్పి పెట్టేసాను. "నా సెంటిమెంట్ కారు, కొంచెం పాడైందని, టో చేస్తావ? మర్చి పోయావ? ఇన్నాళ్ళు మనకెంత సేవా చేసిందో" అని పెద్ద క్లాసు తీసుకొన్నాను. తను వద్దంటున్న వినకుండా పక్కనే ఉన్న రిపైర్ షాప్ కి టో చేయించాను. టో కి ఒక 50 $ పైనే అయ్యాయి. ఆ షాప్ వాడు, దీనికి పెద్ద ప్రాబ్లం ఉంది ఒక 1000 $ వరకు అవుతాయని చెప్పాడు. ఇక మా ఆవిడ ఊరు కోలేదు, "దీనికి ఇప్పటికైనా అమ్ముతార ? లేదా" అని ఒకటే పోరు. "చూడు సఖి, ఈ రిపైర్ షాప్ వాడికి సరిగ్గ్గా తెలిసినట్టు లేదు, ఒక్కసారి షో రూం కి తీసుకేల్లానంటే, వాడి యిట్టె బాగు చేస్తాడు" అని ఒప్పించి, ఇంకో 100 $ ఇచ్చి అక్కడనుండి షో రూం కి టో చేయించాను.
మజ్ద షో రూం కే వెళ్లి కారు రిపైర్ కి estimate అడిగాను, వాడు కంప్లేటు చెక్ చేయడానికి 250 $ ఛార్జ్ అని చెప్పాడు, తర్వాత estimation ఇస్తాము అన్నాడు, మా ఆవిడ మొఖం ఇంకో సారి చూడలేక పోయాను. ఇంతలో మళ్ళి ఫోన్, 1800 జంక్ వాడే, ఈసారి మీకో 10 $ గిఫ్ట్ కార్డు కూడా ఇస్తాం అని బేరం ఆడుతున్నాడు. నేను ఫోన్ పవర్ ఆఫ్ చేశాను. షో రూం వాడితో "మా బుజ్జ్జి గాడిని గౌరవంగా సాగనంపె మార్గం ఉందా "అని అడిగాను. వాడు, "మీకు నచ్చితే డొనేట్ చెయ్యండి", ఎవరినా పేదవాళ్ళు వాడుకొంటారు అని చెప్పాడు. నాకు ఆ సలహా చాల బాగా నచ్చింది. ఇంటికి వెళ్లి డొనేట్ చెయ్యన, లేక ఒక 1000 $ పెట్టి రిపైర్ చేయించన అని చాల ఆలోచించాను. కానీ చాల ఎక్కవ ఆలోచించాను, ఒక వారం దాటింది, రెండు వారాలు దాటాయి, ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అని వాయిదాలు వేసాను. ఒకరోజు టోఇంగు కంపెనీ నుండి లెటర్ వచ్చింది, అందులో "మీ కారు మా దగ్గరుండి, దయచేసి 2500 $ కట్టి తీసుకెళ్ళండి" అని ఉంది. నేను హడావిడిగా మజ్దా షోరూం కి పరిగెట్టాను, వాళ్ళు "మీ కోసం రెండు రోజులు చూసాం, రాక పోయేసరికి టో చేసాం", "మీ ఫోన్ రాలేదు, ఇక మేము ఏమి చెయ్యలేము" అని కూల్ గా చెప్పారు. టొ కంపెనీ కి ఫోన్ చేశాను, "కారు కొన్నప్పుడే దానిఖరీదు 2500 $ లేదు" అని మొత్తు కొన్న టొ కంపనీ వాడు వినలేదు. "మీ కారుకు పదిహేను రోజులనుండి మాదగ్గర ఉంచినందుకు డబ్బులు కట్టాలి అన్నాడు". అలా కాదు ఇంకో మాట చెప్పమంటే వాడు సరే ఒక 250 $ కట్టి కారు మర్చిపోండి అని చెప్పాడు. కారులో ఉన్న ప్రతి వస్తువు వాడిదే నట, ఆఖరకు చిన్నపిల్లల piano , సగం తిన్న మొక్క జొన్న పొత్తులు , పాత కరెంటు బిల్లులు, స్పేరు టైరు,.. ఒకటేమిటి మొత్తం అన్ని వాడివే. నేను మా ఆవిడకు రాసిన కవితల పుస్తకం కూడా వాటిలోనే ఉంది. మా ఆవిడతో ఆ విషయం చెప్పి, ఒక్కసారి కారుని చివరిసారిగా కనీసం ఫోటో ఐన తీసుకుంటాను అంటే, వళ్ళు మండి 50 $ ఫోన్ నేలకేసి బాది, తన క్రెడిట్ కార్డుతో టో కంపెనీ కి డబ్బులు కట్టి , ఆ రోజు సంతోషంగా నిద్ర పొయింది, నాకు రాత్రంతా కల్లో నా పాత కారే. కొన్ని బంధాలు ద్రుడమైనవి. తర్వాత ఇంటర్నెట్ లో VIN నెంబర్ తో సెర్చ్ చేస్తే, నా కారు కొత్త ఓనర్ దగ్గర ఉంది, అదేక్కడున్న దాని సంతోషమే నా సంతోషం. ప్రతి దసరాకు దాని పేరు మీద కూడా పూజ, దాని ఫొటోకో రోజా! నువ్వేక్కడున్న వర్ధిల్లు నేస్తం.
అబ్బే ఏమిలేదు హనీ .., సరదాగా ఒక జరిగిన కధ రాస్తున్నానంతే!, అబ్బే.. కారా..? అలాంటిది ఏమిలేదు , వచ్చేస్తున్నా .. సరే మరిక ఉంటానండి, మా ఆవిడ భోజనానికి పిలుస్తోంది.
ఇందులో నిజమెంతో కానీ బాగా నవ్వించారు.
ReplyDelete