ఒక్క సారి మన హిందూ మతం గురించి ఆలోచిస్తే, అసలు నేను ఇన్ని సంవత్సరాల నుండి ఏమిటి నేర్చుకొన్నాను అని అనిపిస్తోంది? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి వయసు ఉంటుంది, రోజు గడిస్తే ఆ వయసు ఇంకొక్క రోజు పెరుగుతుంది. ఈ భూమి వయసు పెరుగుతుంది, సముద్రం వయసు, మనుషుల వయసు, చెట్టు చేమ ఒక్కటేమిటి ఈ సమస్త విశ్వంలో ప్రతి పరమాణువు వయసు పెరుగుతుంది. పెరిగిన వాటికి అనుభవం ఎక్కువంటారు. రోజు గడిస్తే సముద్రం ఎక్కువ ఉప్పగా అవుతుంది, భూమి మరింత బరువవుతుంది, మనిషికి జ్ఞానం పెరుగుతుంది, అప్పులకు వడ్డీ పెరుగుతుంది, ఇలా చాల విషయాలు పెరుగుతాయి. మరి నా భక్తి పెరిగిందా? పెరుగుతుందా ? పెరిగే అవకాసం ఉందా?
నా చిన్నతనంలో దీపావళి అంటే చెప్పిన కధ గుర్తొస్తోంది. నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు , అతనితో కృష్ణుడు యుద్ధం చేసాడు, మధ్యలో చెయ్యలేకపోతే, కృష్ణుని భార్య సత్యభామ బాణం తీసుకొని , నరకాసురుని వధించింది, దానితో ప్రజలందరూ సంతోషంతో అమావాస్య చీకట్లు పోగ్గొట్టి (రాక్షసుడిని అమావాస్య రోజు చంపి) వెలుగు నింపిన (తన బాణాలతో వచ్చిన వెలుగు అని ఇంకో అర్ధం!) రోజు కనుక దీపావళి జరుపుకొంటాం. ఇప్పటికీ ఇదే కధని దాదాపు అటు,ఇటుగా పిల్లలకు చెబుతారు. కధ సంగతి సరే కానీ, ప్రతి దీపావలి పండుగకు మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఉదయం షుస్ట్టుగా భోజనం చేయడం, బైటకు వెళ్లి సంచి నిండా టపాకాయలు కొని తేవడం, కాల్చడం. కొన్ని దశాబ్దాలు క్రితం అంతే, ఒక 50 సంవత్సరాల క్రితం అంతే, ఇప్పడు కూడా ఇంతే!. ఇక ముందు కూడా అంతే.
సంక్రాంతి రోజుల్లో కూడా ఇదే తంతు. భోగి నాడు భోగి పళ్ళు, కనుమ రోజు, తిన్న వాళ్ళకి కక్క ముక్క , సంక్రాంతి రోజు కొత్త బట్టలు, ఈ మూడు రోజుల్లో ఒకటొ రెండో సినిమాలు. కాల్చే బాణసంచాలు మారొచ్చు గాక, వండే వంటకాలు మారొచ్చు గాక, బట్టల డిజైన్లు మారొచ్చు గాక, మన ఆలోచనలలో మార్పు లేదు. పండుగ అంటే, వండుకోవడం, సినిమా చూడడం, వీలైతే పేక ఆడడం, బలవంతపు జోకులు చెప్పుకొని నవ్వుకోవడం, ఇవే మన పండగలు అని మన పిల్లలకు నేర్పించడం!.
నిజానికి పండుగ అంటే ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్పిన ఎంత మంది తలకేకిన్చుకోగలరు? కొంచెం పురాణాలూ తెలిసిన వాళ్ళని గట్టిగ అడిగితే, సంక్రాంతి అంతే సూర్యుడు మకరరాసిలోకి వస్తాడు, దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది అంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మకర రాశిలోకి వస్తున్నాడు, మనం పిలుచుకొనే ఉత్తరాయణం , దక్షిణాయనం సృష్టి మొదటి నుండి ఉన్నాయి, అయినా సంక్రాంతి ఎప్పడు మొదలైందో? మన పెద్దలు ఎన్నో ఆలోచించి మనకు పండుగలు పెట్టరనుకొందాము, సరే వాళ్ళు మనకు చెప్పిన దేమిటి? అట్ల తద్ది రోజు, పూటుగా అట్లు పోసుకు తినండి, కనుమ రోజు మేకలు కొట్టండి, దీపావళికి బాణసంచ కాల్చండి, నాగుల చవితో రోజు చలిమిడి తినండి, శ్రీరామ నవమి రోజు పానకం తాగండి, బోగి రోజు పాత సామాన్లు కాల్చండి ఇలాంటివి చెప్పారా? లేక మనం మాత్రం ఇవే వంట బట్టించు కొన్నామా? పండుగ అంటే తిండి, కొత్త బట్టలు, విందులు వినోదాలు గా మన మతాన్ని మార్చిన వాళ్ళెవరు? మన తర్వాత తరాలకు కూడా ఇదే సంప్రదాయం అందిస్తామా?
ఇందులో తప్పేంటని మీ అనుమానం కదూ? పండగ ఉన్నదే తినడానికి, నలుగురితో సరదాగా గడపడానికి, అని మీ అభిప్రాయం అయితే ఇక వాదన లేదు. సరదాగా గడపడం ఎన్నటికి తప్పు కాదు, అలా గడపడానికి పండగను అడ్డుపెట్టుకుంటున్న వాళ్ళతో మనకు వాదన లేదు. పండగ రోజున మనం ఏమి నేర్చుకొంటున్నాము? ఒక్క టంటే ఒక్క కొత్త విషయం? పది సంవత్సరాల క్రితం సంక్రాంతికి, ఇప్పటికి నేను ఏమిటి నేర్చుకొన్నాను? మన హిందూ మత పరంగా? ఒక్క కొత్త మంత్రం? ఒక పూజ విధానం? నా పండుగల వయసు కొన్ని దశాబ్దాలు పెరిగింది కదా, మరి మన మతంలో ఉంటూ నా భక్తి పెరిగిందా? నేర్చు కోవడానికి అసలు ఏముంది కనుక? అని అనుమానం తెప్పించారు. ప్రతిసారి గుడికి వెళ్ళడం, కళ్ళు మూసుకొని ఒక అరక్షణం ప్రార్ధించడం, అటునుండి అటే సినిమాకో, హోటల్ కో వెళ్ళడం!
ఈ ప్రపంచంలో అతి సులువైన మతం హిందూ మతం అని నా కనిపిస్తుంది. పండగ వచ్చిందా, నీకు అస్సలు శ్రమ లేదు, కొత్త బట్టలున్నాయా? పిండివంటలు చేయగలవా? నువ్వు పాస్ అయిపోయావు, దిగ్విజయంగా పండగ జరుపుకో! నువ్వు ఎలాంటి మంత్రాలు చదవక్కరలేదు, ఎలాంటి పూజ విధానం తెలుసు కోవక్కరలేదు, ధ్యానం తో అస్సలు పనిలేదు, నీకు మానసిక శక్తి నిచ్చే ప్రాణాయామం తో పనిలేదు, మహా ఐతే రెండు మూడు పేజిలున్న వ్రత కధ ఒకటి దగ్గర పెట్టుకో, లేక పోయిన నష్టం లేదు. మన దేవుడికి ఒక్క బెల్లం ముక్కైన చాలు. పండగ ఘనం గా ఉండాలంటే గుడికి వెళితే సరి!. ఏమిటి గుడికి ఏ పుస్తకం తీసుకెళ్లాలా? బాబు.., మనది హిందూ మతం, మన తప్పులు క్షమించడానికి శతకోటి దేవుళ్ళు, అయినా బడికి పుస్తకం కానీ గుడికేమిటి..? జేబులో ఒక వంద నోటు ఉందా.?, నువ్వు సాధించావు పో.., ఇక నీ పాపాలన్నీ ఆ గంగలో కలిసినట్టే!, వంద నోటు తీసుకెళ్ళి ఒక్క అర్చన టికెట్ కొను, అభిషేకం అయితే మరి మంచిది, నీ పాపాలన్నీ పోగొట్టే భారం మరిక పూజారిదే!, వందనోటు మహిమోయ్!, పైసా లో పరమాత్మ ఉండడం అంటే ఏమిటి అనుకొన్నావు? పూజారి ఒక్కసారి మైక్ లో నీ పేరు, గోత్రం చదివేవరకు ఉండు, చదివిన తర్వాత నువ్వు అక్కడ లేక పోయిన ఫర్వాలేదు, అసలు పోస్టల్ పూజలు, ఇంటర్నెట్ పూజలు కూడా వచ్చాయో య్, నువ్వు రావలిసిన పని లేదసలు. పూజారి చదివేది నీకు ఒక్క ముక్క అర్ధం కావక్కరలేదు, చివరాఖరికి తీర్ధం పుచ్చుకో, ప్రసాదం కళ్ళ కద్దుకొని, ఒక్క కొబ్బరి ముక్క అలా నోట్లో వేసుకోన్నవంటే, సర్వపాపాలు 'హరి' మనవూ? ఆ పూజేదో చేసేసుకొంటే, ఇక నీ భోజనాలు, సినిమాలు , షికార్ల మీద పడొచ్చు, షరా మాములే!. ఇప్పుడు చెప్ప్పు ఇన్ని డిస్కౌంట్లు నీకు ఏ మతంలో ఉన్నాయి? అందుకే కదూ దశాబ్దాలు గడిచిన, మనకు ఆయువు పట్టు లాంటి వేదంలో ఒక్క ముక్క నేర్చుకోలేక పోయాను. గుడికి వెళ్ళాలంటే భక్తి కన్నా ముందు ఒక పది రూపాయలుండాలి అనే స్థితికి వచ్చాను. అభిషేకం, అర్చన, నా పాపాలు పోగొడతాయి అని నన్ను ఎవరు నమ్మించారు? నా దగ్గర కొన్ని వందల రూపాయలు, తీసుకొని నా మతం నాకు ఇచ్చిన దేమిటి? సగం కొబ్బరి ముక్కలు, కొన్ని అరటిపళ్ళు. ఒక్క మంత్రం నా చేత చదివించలేదు, (అప్పుడప్పుడు ఇంట్లో చేయించిన పూజలో "మమ" అన్నట్లు గుర్తు). ప్రాణాయామం అని చెప్పి ౩ సార్లు ముక్కు మూయించిన గుర్తు, అంతే నేను నేర్చు కొన్నది.
గుడి కెళితే, మతానికి డబ్బుకి ముడి పెట్టిన వాళ్ళెవరు? గుడికి వచ్చే భక్తులను, sponsors గాను నాన్ sponsors గాను విడగొట్టి, వాళ్ళని వేరు వేరు వరసల్లో నిలిపేది ఎవరు? మన చేత ధ్యానం చేయి౦చకుండ , పట్టుమని పది నిముషాలైన ప్రాణాయామం చేయి౦చకుండ, నోటితో ఒక్క మంత్రం పలికించకుండా, కనీసం గట్టిగ నమ్హ శివాయ అనిగాని, గోవిందా.. గోవింద అని గాని అనిపించకుండా, దృష్టంతా మన అర్చన , అభిషేకం, కళ్యాణం టికెట్ల మీద పెట్టెదేవరు? మనం సేవల టికెట్స్ కొసం ఎదురు చూసి, ఒకరిద్దరు టికెట్స్ తెచ్చి ఇవ్వగానే పూజ మొదలు పెట్టేదెవరు? మనకు గుడిలో ఒక్క మంత్రం ఏ పూజారైన నేర్పాడ? కనీసం ఏనాడైనా దేవుడికి నైవేద్యం పెట్టడం ఎలాగో నేర్పార? ప్రతి చోట తొందర, పూజ తొందరగా ముగిసి పోవాలి, త్వరగా ఇంటికి వెళ్లి పోవాలి లేక సినిమాకు వెళ్ళాలి అని ఆలోచించే భక్తులు కూడా ఉన్నారు. గట్టిగ అరగంట ధ్యానం లో కూర్చొనే ఓపిక ఉండే భక్తులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి తగ్గట్టే, గుడిని కూడా బిజినెస్ గా మార్చి, భక్తులను ఆకట్టుకోవడానికి ఎన్ని ట్రిక్కులు! ఇక గుడికి వెళితే ప్రశాంతత ఎలా వస్తుంది? నా మాటకు నేను, ఒక అజ్ఞానిలా గుడికి వెళ్ళాలి, ఒక్క భక్తి తో మాత్రమే వెళ్ళాలి, ఎటువంటి రొక్కం లేకుండా దేవుడిని దర్శించుకోవాలి, తిరిగి గుడినుండి వచ్చేటప్పుడు, ప్రశాంతమైన మనసుతో రావాలి, నా ముఖంలో కొత్త విషయం నేర్చుకొన్నాను అన్న ఆనందం కలగాలి, నేను నేర్చుకొన్న విద్య మొరోకరితో పంచుకోనేదిగా ఉండాలి, నాకు అవసరానికి అక్కరకు రావాలి. ఇవన్ని జరిగే గుడి ఏమిటో మీకు తెలుసా? లేక మనమే సులువైన మార్గాలు ఎన్నుకొని, టికెట్ కొంటె చాలు, పుణ్యం వస్తుందని, మన మంచి చెడ్డలు పూజారి చూసుకొంటదాని ఇలా అలవాటు పడ్డామ?
సప్త సముద్రాల లోతు కలిగిన విజ్ఞానం ఉన్న నా మతం నుండి నేను ఎందుకు ఏమి నేర్చుకోలేక పోయాను? అవును తప్పు నాలోనే ఉందా? నేను ఇప్పుడు గుడికి వెళితే జరిగేది ఏమిటో నాకు ముందే తెలుసు. ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అర్చన, కళ్యాణం, అభిషేకం టికెట్స అమ్ముతారు, ఏదో ఒకటి కొనాలి అంతే. అలా కాకుండా ఏదైనా ధర్మ సందేహాలు నివృతి చేసుకోవడానికి గుడికి వెళ్ళే రోజులు పోయాయి. పూర్వం గుడిలో యోగులు, యోగ భ్యాసం , మంత్రం, ధ్యానం నేర్పెవాళ్ళట!, ఒకరో ఇద్దరో యోగులు నిత్యం ఉండే వాళ్ళట!, కాషాయ బట్టల్లో తెల్లగా నెరిసిన గడ్డంతో ఉన్న నిజమైన ఋషులను గురించి కధల్లో చదవటం తప్ప గుళ్ళలో చూసిన గుర్తు లేదు. అయినా.. గుడిని కూడా బిజినెస్ గా నడుపుతుంటే , ఇక్కడకు ఋషులు ఎవరు వస్తారు? వస్తే ఋషుల ముసుగులో స్వామిజిలు రావాలి. వాళ్ళ ఖర్చులు కూడా టెంపుల్ వాళ్ళే పెట్టుకోవాలి!. నాకు మాత్రం నేనొక అర్చన టికెట్ కొనే యంత్రం గా మిగల దలుచుకోలేదు!, నాకు నేర్చుకోవాలనుంది, మన కష్టాలను తీర్చి, సుఖాల తీరం చేర్చే వేదాల్లో ఉన్న మంత్రాలను నా నోటితో పలకాలనుంది. నేను దేవుడిని తెలుసు కోవాలంటే అది నా మనసు దేవుని మీద పెట్టి చేసే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. నేను నేర్చుకొనే మంత్రాలు నాకు మానసిక శక్తి ప్రసాదించు గాక, నా ధ్యానం నాకు ప్రశాంతత చేకూర్చు గాక. హిందూ మతం లో సారాన్ని వదిలి, దానికి ఎంతో సులువైనది గా మార్చి, కేవలం నేను కొన్న అర్చన టికెట్ నాకు మోక్షం ప్రసాదిస్తుంది అన్న బ్రమలు నాకు కలగకుండు గాక.
మీ ఆవేదన సమంజసమైనది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteమీది వ్యధే!
ReplyDeleteమీది, సామాన్యుని వ్యధే!
అందరూ వీటిని గమనిస్తున్నారు...
భూమి గుండ్రంగా వుంది....మంచిరోజులు తిరిగి వస్తాయి ....
ప్రస్తుత తరం విజ్ఞ్తతతో, ఇదంతా గమనిస్తూంది....
మంచి-చెడులని, జరుగుతున్న అవాంచిత పరిణామాలని బేరీజు వేసుకుంటూంది....
వాస్తవానికి మనిషి సుఖాభిలాషి. నిజమైన సుఖం ఎందులో వుందో వాడు వెతుకో గలడు...
మంచిరోజులు తిరిగి వస్తాయి.
దయచేసి "హిందూ", మతం కాదని గుర్తుచేయదలుచు కున్నా...
ఇది "హిందూ" ధర్మం . సనాతన ధర్మం...
సూర్యుడేప్పుడు లోకబాంధవుడుకనుక తన ధర్మానుసారం కిరణాలు వెదజల్లుతూనే ఉన్నాడు. ఆకిరణలే తమను తాకకుండా చీకటిలో నివసించేవారికి .బయటకొచ్చినా గొడుగులు పెట్టుకుని ఆకిరణాలు తమశరీరం పై పడకుండా చూసుకుంటున్నవారి అజ్ఞానానికి సుర్యుడేమి చేయగలడు ?
ReplyDeleteఈ సనాతన ధర్మం అంతే ! తన కిరణాలను ఎళ్లవేలలా ఏ బేధం లేకుండా ప్రసరిస్తూనే ఉంటుంది . మనమే వెళ్ళాలి ప్రయత్నించి దారిచూసుకుంటూ . రహదారులన్నీ కలిమాయవలన కప్పబడి ఉన్నాయి . తప్పదు యుగధర్మమిది .
భానుని కాంతి కావాలి కానీ బాధించే కిరణాలు వద్దు,
ReplyDeleteవెన్నెల చల్లదనం కావాలి కానీ అమావాస్య చంద్రుడు వద్దు
మధురమైన తేనే కావాలి కానీ కుట్టే తేనెటీగలొద్దు
మత్తెకించే మతం కావాలి కాని మతిలేని ఆచారాలోద్దు
కరుణించే దైవం కావాలి కానీ ఖటినమైన నియమాలోద్దు
వెంటనే దీవిస్తే దెయ్యమే దేవుడు శ్రమలేని పనికి సదా సిద్దమీ జీవుడు
దుర్గేస్వర్ గారు,
ReplyDeleteచాల బాగా చెప్పారు. మీ వ్యాఖ్య చదివిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన పైన పోస్ట్ చేశాను.
విజయ మోహన్ గారు, సత్య గారు మీ కామెంట్స్ కు ధన్యవాదాలు. సమస్య ఉంది అని మీరు గుర్తించడం చాల పెద్ద విజయం. నేను కూడా ఆలోచిస్తున్నాను, ఏమి చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను.
ReplyDeleteకాకి తన గుడ్లని పొదుగుతుంది, తనకు తెలియకుండానే కొయిల గుడ్లని కూడా పొదుగు తుంది, పొషిస్తుంది.
ReplyDeleteసక్రమంగా, ఆదర్శంగా మన పని తానూ చేసుకుంటూ పోతే మనకు తెలీకుండానే మనం ఇతరులని ఉద్ధరించిన వాళ్ళవుతాం...
కొందరు వితండ వాదులు వ్యవస్థ మారితేనే వ్యక్తుల్లో మార్పొస్తుందటారు...
కాని వాస్తవానికి మనిషిమారితేనే వ్యవస్థ మారుతుంది...మనిషి వ్యక్తి గతంగా ఉత్తంమంగా మారక పోతే వ్యవస్థ మారినా వాటిలో లొసుగులు వెతుక్కునే కుసంస్కారానికి ఆస్కారం ఏర్పడుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న దిదే....
మంచి వ్యవస్త అవసరమే కాని మంచి్వ్యక్తులు లేక పోతే వ్యవస్థ మంచిదైనా సత్ఫలితాలు ప్రస్ఫుటించవు.
"మార్పు" రావాలి , "సహజంగా" రావాలి, "నెమ్మదిగా" రావాలి ..!
నెమ్మదిగా వచ్చిన మార్పు "శాశ్వతంగా" ఉంటుంది....
మనిషి శ్వాసనైనా వదులుతాడు కానీ, ఆశ వదలడుగా!.
-సత్య
హిందూ మతం గురించి ఎవరయినా ఏదయినా వ్రాస్తే, ఇందులో ఏదయినా, మనకు ఏమీ తెలియకపోయినా,ఎంతోకొంత తెలుసుకోవటానికి దొరుకుతుందన్న ఆశతో చదువుతుంటాం. కాని సాంతం చదివాక ఇంకా ఏదో ఇందులో వుంటే బాగుండేది, ఇందులో ఇలా వ్రాసారు, అలా కాదుకదా అనే అనుమానాలు సహజం.కానీ శాశ్వత ఆనందం నాకు ఇందులోవుంది అని అందరూ ముక్తకంఠంతో చెప్పగలిగింది ఏదయినా ఒకటి వుందీ అంటే ఎవరయినా ఆ ఒక్క సమస్యను సఫలం చేయటానికి ప్రయత్నించి సాధించగలరేమో. కానీ భిన్నమైన రుచులు విభిన్న ఆశయాలు వున్నపుడు తేలు కాటుకూ పాము కాటుకూ ఒకే మంత్రం కావాలంటే ఎలా. ఏది అవసరమో, ఎందులో శాశ్వత సుఖం వుందనుకొంటారో దాన్ని ఎంచుకోవటం మానవ సహజం.అవసరమైతే మరో ప్రపంచాన్నీ సృష్ఠిస్తాడు. చాలా గొప్పగా సాగింది మీ వ్యాఖ్య.
ReplyDelete