అన్నా, మనం అంటే అందరకు చిన్న చూపే, ముష్టి వాడిగా పుట్టడం అంత పాపం మరోటి లేదు, పొరపాటున ఈ వృతి లోకి పచ్చాను, ఇక నేనెంతమాత్రం ఈపని చేయలేను అని భాదపడుతున్న ఓ జూనియర్ ముష్టి వాడిని ఓదారుస్తూ సీనియర్ ఇలా అంటున్నాడు.
నిజమే ముష్టివాళ్ళు అంటే అందరకు చిన్నచూపు, నాకు తెలుసు మనగురించి ఈ గోప్పోల్లంతా ఇలా అనుకొంటారు. "ముష్టివాళ్ళు బాబు, అయ్యా అని అదేపనిగా దీనమైన స్వరం తో, నరకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు ప్రాధేయ పడతారు. మనం వెళ్ళవయ్య , చిల్లరలేదు పో అంటే వెళ్ళ కుండ , మళ్ళిమళ్ళి ప్రాధేయ పడతారు. ఎక్కడో జేబులో ఏదో మూలనుండి ఒక రూపాయ్ నాణెం తీయక పోతార అనే ఆసతో, గొంతులో దీనత్వ౦ తగ్గగుండా, సిగ్గు మోఖమాటం లేకుండా అదే పనిగా వెంట పడతారు. డబ్బులేస్తే దణ్ణం పేడతారు, లేక పొతే ఇంకో దాత కోసం ఎదురు చూపులు. వీళ్ళకు ఒక సారి చెపితే అర్ధం కాదా? అసలు ఇలాంటివాళ్ళు ఎందుకు పుడతారు?"
"కానీ మనలను ఇంత తిడుతున్నా వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో మనలాగా అడుకోన్నేవాళ్ళే" అనగానే జూనియర్ నమ్మలేదు. "లేదు అన్నా మనం అడుక్కున్నమంటే కడుపుకాలే పిల్లలకు ఇంత ముద్ద పెట్టాలని, మరి గోప్ప్పోల్లు ఎందుకడుక్కుoటారు? నేన్నమ్మను" అన్నాడు. "సరే నువ్వే చూద్దూగాని" అని సీనియర్, జూనియర్ ని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్ళాడు.
అది రైల్వే స్టేషన్ , విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే రైల్ కొద్ది సేపటిలో బయలుదేరబోతోంది, హడావిడిగా వచ్చిన రిజర్వేషను కన్ఫర్మ్ కాని ఒక సూటు బూటు హీరో గారు టీసి దగ్గరకెళ్ళి "బాబ్బాబు ఏదో ఒక బెర్త్ రిజర్వు చెయ్యండి" అంటున్నాడు. టీసి మర్యాదగా "బెర్తులు లేవండి, వెయిటింగ్ లిస్టు చాల ఉంది ఇప్పుడు కుదరదు" అనే చెప్పాడు, కానీ మన హీరో గారు పట్టు వదలని అక్రమర్కుడులాగా మళ్ళి మళ్ళి టీసి ని విసిగించడం మొదలు పెట్టాడు, టీసి కి సహనం నశించి "ఎన్ని సార్లు చెప్పాలండి బెర్తులు లేవని , నన్ను ఇక ఇబ్బంది పెట్టకండి" అని కసురుకొన్నాడు. కానీ మన హీరో గారు అదేమీ పట్టించుకోక, టీసి వెంటే తిరిగి తిరిగి , ఎన్నో సార్లు తిట్లు తిని , మర్యదంతా పోగొట్టుకొని .. చివరకు ..ఇక బెర్త్ దొరికే ఎంత లేక పొతే ఎంత ? ఆ వేడికోలు, ప్రార్ధనలు చూసి నేనైతే కేవలం నిద్ర కోసం ఇంత దిగాజారను అని జూనియర్ కళ్ళల్లో విస్మయం తో కూడిన ఆశ్చర్యo
ఒక్క రైల్వే స్టేషన్ కాదు, బస్సు స్టేషన్, RTO ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, రేషన్ డిపో, మునిసిపల్ ఆఫీసు , ఇలా ఎన్నో తిప్పి చూపించాడు సీనియరు . ఏక్కడ చూసిన అవే దీన మైన వేడికోలు. వాళ్ళందరూ వాళ్ళ స్థాయికు తగ్గి దీనంగ తమ పనులు జరగడం కోసం ప్రాధేయ పడ్డ దృశ్యాలెన్నో! పైకి గంభీరంగా కనిపించే వాళ్ళందరూ, ఒక చిన్న లాభం కోసం, సౌకర్యం కోసం తమ స్థాయిని మర్చిపోవడం చూస్తె వింతగా అనిపించింది జూనియర్ కు . అతనన్నాడు , " అన్నా నాకు ఒక విషయం అర్ధం ఐంది, ఈ గొప్ప వాళ్ళందరూ తమ పని పూర్తి అవడం కోసం ఎవ్వరి కాళ్ళు పట్టుకొన్న తప్పులేదు, ఎలాంటి వాడిని "సర్" అని పిలిచినా తప్పులేదు, సిగ్గు, అభిమానం, వ్యక్తిత్వం ఇవేవి పని జరగడం కన్నా గోప్పవేమి కాదు, ఇవ్వన్ని పని పూర్తి అయ్యాక , వాటంతట అవే తిరిగి చేరతాయి అందుకే పనులు జరగాలంటే వీటినన్నిటిని కాస్త పక్కన పెట్టాలి" అన్నాడు. అది విని సీనియర్, "బాగా గ్రహించావురా, ఇంకో విషయం వింటే నవ్వుతావు, వాళ్ళు అలా బ్రతిమిలాడక పొతే వాళ్ళ పనులు కొంచెం ఆలస్యం అవుతాయ్ లేదా తాత్కాలికంగా కొంచెం కష్ట పడతారు, కానీ పని జరగకుండా పోదు, ఆ కాస్త ఆలస్యం భరించలేకే ఎంతకైనా దిగాజారుతున్నారు. ఈ గొప్ప మనుషులు తమకు అన్నే అనుకూలంగ ఉన్నప్పుడు, నీతికి, వ్యక్తిత్వానికి, మాటకి కట్టుబడినట్లు, ఎంత బిల్డప్ ఇస్తారు, వీళ్ళ వల్ల ఒక్క చిన్న మాట తేడాతో పెళ్ళిళ్ళు ఆగిపోవడం చూసాం, సొంత బంధువులు సంవస్సరాల తరబడి మాట్లాడడం మానేయడం చూసాం, ప్రాణ స్నేహితులు విడిపోవడం చూసాం, కొంచెం సౌకర్యం కోసం, కాస్త సుఖం కోసం అదే జనం మన ముష్టి వాళ్ళకన్నా, దారుణంగ ప్రాధేయ పడడం చూస్తున్నాం. కానీ ఈలోకo చాల విచిత్రమైంది రా! మనకు ఎప్పటికి అర్ధం అవదు, అందుకే అడుక్కునావని ఎప్పుడు బాధపడకు, మనకన్నా గొప్ప వాళ్ళు చాల మందే ఉన్నారు" అని జూనియర్ కి ఉపదేశం చేసాడు.
తమ ఊరి యంయేల్య కాళ్ళు పట్టుకొని, పాదాభివందనాలు చేసి తమ కొడుకులకి గవర్నమెంటు కాలేజి లో సీట్లు ఇప్పించుకోవాలని వెళుతున్న ఇద్దరు సగటు తండ్రులు ఈ సంభాషణ విని , అడుగు ముందుకు పడక, అక్కడే ఆగి , మమ్మలను క్షమించండి అని మనసులో వేడుకొని , ముస్టివాళ్ళను (ఇంకా ముష్టి వాళ్ళు అందామ?) ప్రేమతో పలకరించి, చేతనైన ధర్మం చేసి , భారంగ యంయేల్య ఇంటికేసి సాగిపోయారు.
No comments:
Post a Comment