Monday, January 9, 2012

అవధానం - దత్తపది సరదాలు



 ఈ మధ్యన నేను అమెరికాలో  శ్రీ మేడసాని మోహను గారి అవధానంలో అప్రస్తుత ప్రసంగo చేశాను. అక్కడ నాకు శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు  పరిచయం అయ్యారు, ఆయనకు అవధానంలో దత్త పది అంశాలు సేకరించడం హాబి, స్వయంగా మంచి కవి కూడా, ఆయన నాకు పంపించిన పద్యాలు మీ అందరికి కోసం ఇక్కర యధాతధంగా మీ ముందుంచుతున్నాను.
----------------------------------------------------------
వ్యాఖ్యాన పూర్వక దత్తపదాలు: ఒక పెళ్ళి కావలసిన యువకుడి కోసం అతని తల్లిదండ్రులు ఒక రోజు పెళ్ళి చూపులు యేర్పాటు చేసుకొన్నారు ఆడపిల్ల తల్లిదండ్రులతో సంప్రదించిన తరువాత. అంతకు ముందటి రోజు రాత్రి యువకుడు తియ్యటి ఆలోచనలతో నిద్రపోయాడు. అతనికి పెళ్ళి చూపుల కల వొచ్చింది. పెళ్ళి కూతురు కలలో భయంకరంగా కనిపించింది. ఆమెయొక్క వికృతాకృతరూపం "నడ్డి ముక్కుతో, మెల్లకళ్ళతోగూని వీపుతో, గారపండ్లతో వుంది. తెల్ల వారినాక పెద్దలు పెళ్ళిచూపులకి వెడదామంటే తన కల సంగతి చెప్పి చచ్చినా పెళ్ళిచూపులకు రానూ అన్నాడు. అప్పుడు  వాళ్ళు అలా అనకూడదు నాయనా, వొస్తామని చెప్పి వెళ్ళకపోవడం పెద్దమనుషుల లక్షణం కాదు, మనం వెడదాము. చూసినాక నచ్చకపోతే జాతకాలు కుదరలేదనో, మా పిల్లవాడు మీ అమ్మయికి తగడనో యేదో వొకటి సద్దిచెప్పొచ్చు" అని అన్నారు. పెద్దల మాటను తీసెయ్యలేక పెళ్ళిచూపులకు వెళ్ళాడా యువకుడు. అక్కడ అమ్మాయి అతిలోక సుందరిలాగా వుంది. అసలు ప్రపంచములో అంత అందము వుంటుందా? అనే విధంగా వున్నది. యిట్లా చెప్పి పృచ్చకుడు అవధానిని 1. నడ్డి ముక్కు 2. మెల్ల కండ్లు 3. గూని వీపు 4. గార పండ్లు అనే రాత్రి కలలోకి వొచ్చిన అమ్మయి అవలక్షణాలను దత్తపదులుగా వుపయొగించి ప్రతయక్షముగా పెళ్ళి చూపుల్లో పిల్ల వాడి యెదుత వున్న అతిలోక సుందరి అందాన్ని వర్ణించ మన్నాడు.

అవధాని: నరాల రామా రెడ్డి .
పూరణ:

చం. సొగసున సాటి రావనుచు సొంపుల సంపగి "నడ్డి ముక్కు" పొ
     ల్పుగ విలసిల్లె, బిట్టువడి మోహపడన్ జగ”మెల్ల కన్నులు”న్,
       నిగనిగ లాడె వీపుపై నీలి కురుల్ సొబ”గూని వీపు”పై,
       నగవులు గార పండ్లు” వదనమ్మున  వెల్గెను మల్లె మొగ్గలై.

వ్యాఖ్యానము: సహజంగా అందమైన అమ్మాయి ముక్కును సపెంగ ప్వ్వుతో పోలుస్తారు. అయితే ఇక్కడ అమ్మాయి ముక్కు యెంత అందంగా వుందంటే ముక్కే సంపెంగ పువ్వుని అడ్డుకొని నువ్వు నాకు సొగసున అంటే అందంలో సాటి రావు అని అందిట. ఆమె కళ్ళు యెంత అందంగా ఉన్నాయంటే  జగమెల్ల అంటె ప్రపంచం అంతా అంటె ప్రపంచములోని జనులందరూ కూడా నిశ్చేష్టులై ( బిట్టువడి ) మోహ పడే విధంగా వున్నాయి ( జగమెల్ల కన్నులున్ ). ఆమె జుట్టు నీలాకాశంలా నిగనిగా మెరుస్తూ సొబగు+పూని=సొబగూని అంటే అందాన్ని పొంది వీపుమీద పడి వుందట. ఆమె పండ్లు యెట్టా వున్నాయంటె  నవ్వులు కారి పోయేటట్ట్లు ముఖాన (వదనమ్మున) మల్లె మొగ్గలలాగ వెలిగిపోతున్నవట.

2 comments:

  1. దత్త పది పూరణ అద్భుతముగా ఉన్నదండి

    ReplyDelete
  2. జిగురు వారు,

    మీరే దీనిని పూరించ వలసి వస్తే ఎలా పూరిస్తారు ? ( మీ పూరణలు శంకరాభరణం బ్లాగ్ లో చదివాను. దాని ని బట్టి ఈ ప్రశ్న మీకు - అంతే )

    జిలేబి.

    ReplyDelete