Sunday, January 22, 2012

అవధానం సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!



సమస్య వివరణ: భగవద్గీతను నమ్మరాదని శ్రీకృష్ణుడు పార్థునితో అంటే అర్జునునితో అన్నాడట. అదేమిటి? గీత బోధ జేసిన శ్రీకృష్ణుడే గీతను నమ్మ రాదని అర్జునుడితో యెట్లా చెబుతాడండీ? అదే సమస్య. అవధాని గారెట్లా ఈ వాక్యాన్ని సమర్థించారో చూద్దాం.


అవధాని: . ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్..
చందస్సు: ఉత్పలమాల

పూరణ:ఉ.

 జాతికి దారి చూపి దృధసత్వమునిచ్చి మనస్సునందునన్
 భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత, దు
 ర్నీతులబద్ధ మిద్దియని నిందలతో పరిహాసమాడినన్
 గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!


వ్యాఖ్యానము: మన జాతి మొత్తానికి దారి చూపించి, దృఢమైన శక్తినిచ్చి మనమనస్సులలోని భయాన్ని పారద్రోలింది భగవడ్గీత. ఆ విధంగా మనకున్న యెన్నో వేదనలనీ, బాధలనీ పోగొట్టింది భగవద్గీత. అటువంటి భగవద్గీతనెవరైనా యివన్నీ అబద్ధాలు అని నిందజేసి పరిహాసమాడితే నమ్మ రాదని కృష్ణుడు పార్థుడితో అంటే అర్జునుడితో అన్నాడయ్యా మిత్రుడా అని ఒక అతను యింకొక అతనితో అంటున్నాడని అవధానిగారు పూరించారు.

1 comment:

  1. 'దృధసత్వమునిచ్చి' 'దృఢసత్వమునిచ్చి' తేడాను గమనించేది.

    చక్కని సమస్యా పూరణం.

    ReplyDelete